21 June, 2026 | 1:37 AM

రుతుపవనాలు గాయబ్

21-06-2026 12:17 AM
  1. ఎల్ నినో ఎఫెక్ట్ తీవ్రం
  2. జూన్ ౨౦ నాటికి నమోదవ్వాల్సిన వర్షపాతం 84.4 మి.మీ
  3. ఇప్పటివరకు నమోదైంది.. 45.6 మి.మీ మాత్రమే
  4. 46% తగ్గిన వర్షపాతం.. వానాకాలం సాగుపై ప్రభావం
  5. ఆందోళనలో రైతాంగం

న్యూఢిల్లీ, జూన్ ౨౦: నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ ప్రభావంతో ప్రస్తుతం భారతదేశంలో రుతుపవనాలు మందగమనంలోకి వెళ్లాయి. వాటి వేగం ఆమాంతం తగ్గింది. తత్ఫలితంగా వర్షపాతం తగ్గింది. దేశ వాతావరణశాఖ(ఐఎండీ) అంచనా ప్రకారం.. జూన్ ౨౦ నాటికి సాధారణ వర్షపాతం దేశంలో 84.4 మి.మీ నమోదు కావాల్సి ఉంంది. కానీ, ఇప్పటివరకు ౫5.6 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది.

అంటే.. ఏకంగా 46 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు లెక్క. వర్షపాతం తక్కువగా నమోదు కావడం భారత వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ఆధారపడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సాగు పనులు వెనకబడుతున్నాయి. జూన్ మూడో వారం వచ్చినా వర్షపాతం ఆశాజనకంగా లేదు. ఉభయ రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణమే కనిపిస్తున్నది. తెలంగాణలోని ఉత్తర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, కోస్తా జిల్లాల్లో వర్షపాత లోటు తీవ్రంగా ఉంది.

దీంతో రైతులు విత్తనాలు నాటేందుకు జంకుతున్నారు. భూగర్భ జలాలు కూడా అడుగంటుతుండటంతో వారిలో ఆందోళన పెరుగుతున్నది. ఇక బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనైతే వేసవిని తలపించేలా ఎండలు దంచికొడుతున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతలతో అల్లాడుతున్నారు. మరోవైపు, రానున్న రోజుల్లో పరిస్థితులు మెరుగుపడతాయని ఐఎండీ అంచనా వేస్తున్నది. నెలాఖరులోపు రుతుపవనాలు వేగం పుంజుకుంటాయని భావిస్తున్నది.

దీంతో మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, బీహార్ వరకు రుతుపవనాలు విస్తరిస్తాయని చెబుతున్నది. అలాగే ఈ వారంలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల గంటకు 40 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులతో కూడిన భారీ వర్షం కురవొచ్చని హెచ్చరించింది. ఈ వాతావరణ మార్పుల వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడి దేశవ్యాప్తంగా రుతుపవనాలు ముందుకు కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నది.