హైదరాబాద్ జూపార్కుకు ‘స్కాచ్’ అవార్డు
- వన్యప్రాణుల సంరక్షణలో అవార్డు అందుకున్న తొలి జూపార్కు
- రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అభినందనలు
న్యూఢిల్లీ, జూన్ 20: అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంరక్షణలో తెలంగాణ అటవీ శాఖ చేపడుతున్న కృషికి ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. ‘మౌస్ డీర్’ సంరక్షణ, బ్రీడింగ్, అడవుల్లోకి పునరావాసం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసినందుకుగానూ నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రతిష్ఠాత్మక స్కాచ్ అవార్డును అందుకుంది. వన్యప్రాణుల సంరక్షణ విభాగంలో ఈ అవార్డును అందుకున్న దేశంలోని తొలి జూపార్క్‌గా నిలిచింది.
కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమలో భాగంగా అందించే ఈ అవార్డుల కార్యక్రమం శనివారం న్యూఢిల్లీలో జరిగింది. నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ వసంత ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంవల్లే అవార్డు సాధ్యమైందన్నారు. మౌస్ డీర్ సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జూ సిబ్బంది, సాంకేతిక బృందం, సహచర ఉద్యోగుల కృషిని వసంత అభినందించారు.
చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. వినూత్న సంరక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు. కాగా జూపార్కుకు ఈ అవార్డు దక్కడం పట్ల అధికారులు, సిబ్బందిని తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అభినందించారు.






