3 May, 2026 | 1:30 AM

గోండు భాష నేర్చిన ఐఏఎస్

03-05-2026 12:06 AM

బండారి లక్ష్మి నర్సయ్య, (ఉట్నూర్, విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీవనం సాగించే గోండుల సమస్యలు తెలుసుకుని, పరిష్కరించేందుకు వారి మాతృభాష గోండి నేర్చుకున్నాడు ఓ ఐఏఎస్. ఏప్రిల్ 30న నార్నూర్ మండలంలోని జామడ గ్రామంలో నిర్వహించిన ఇప్పపూల పండుగలో ఐటీడీఏ పీఓ మంద మకరందు గోండి భాషలో ప్రసంగించడంతో గిరిజనులు, గిరిజన నాయకులు ఆశ్చర్యపోయారు. 

గోండు భాషా వస్తే గోండులను అభివృద్ధి పథంలో తీసుకెళ్లవచ్చని ప్రతి అధికారి అనుకుంటారు. కానీ వారి మాతృ భాష నేర్చుకోవడమే కష్టం. ఆదిలాబాద్ జిల్లాకు ఐఏఎస్ అధికారుల్లో ముగ్గురు మాత్రమే గోండు భాష నేర్చుకున్న వారు ఉన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా పదవి బాధ్యతలు స్వీకరించిన దివంగత ఐఏఎస్ అధికారి పి.సుబ్రహ్మణ్యం 1991 గోండు భాషను నేర్చుకొని గిరిజనుల సమస్యలను తెలుసుకొని, సమస్యలను పరిష్కరించారు.

ఆ తర్వాత వచ్చిన ఐఏఎస్ అధికారులు  గోండు బాషా నేర్చుకోవాలని తపనపడినా నేర్చుకోలేకపోయారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్‌గా వచ్చిన ప్రస్తుత పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ గోండి భాషను నేర్చుకొని గోండులతో మమేకం కావడంతో పాటు  వారి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని సమస్యలను పరిష్కరించారు. నేటికీ జిల్లాలోని గోండు గూడాలలో తన పేరును చిరస్థాయిగా నిలుపుకున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో గిరిజనులు ఒక గూడెం ఏర్పాటు చేసుకుని దివ్య గూడంగా నామకరణం చేసుకున్నారు. 

గోండు భాషలోనే సూచనలు

ఇటీవల ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా బాధ్యతలు చేపట్టిన మంద మకరందు గోండి భాష నేర్చుకున్నారు. ఏప్రిల్ 30న నార్నూర్ మండలంలోని జామడ గ్రామంలో  నిర్వహించిన ఇప్ప పూల పండగలో జిల్లా కలెక్టర్ రాజర్షితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంద మకరందు గోండి భాషలో ప్రసంగించడంతో గిరిజనులు, గిరిజన నాయకులు ఆశ్చర్యపోయారు. పీఓగా తన ప్రసంగంలో గోండి భాషలో మాట్లాడుతూ.. పిల్లలను చక్కగా చదివించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని తన ప్రసంగంలో విన్నవించారు. ఈ సందర్భంగా గోండులు చర్చించుకుంటూ.. సుబ్రహ్మణ్యం, దివ్య దేవ రాజన్  తర్వాత ప్రస్తుత వచ్చిన పీవో గోండి భాషలో మాట్లాడటం అదర్శనీయమని  అంటున్నారు.