ఆర్యవైశ్యులకు అండగా ప్రభుత్వం
పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ఆర్యవైశ్యులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని, అందులో భాగంగానే వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఆర్యవైశ్యలకు పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం అని ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. ఆర్యవైశ్యలకు సముచిత స్థానం కల్పించేందుకు సూర్యాపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా మొరిశెట్టి నివేదితకు అవకాశం కల్పించిందన్నారు. వాసవి మాతా స్పూర్తితో అహింస మార్గంలో ధర్మబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు.
అనంతరం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ దేశాన్ని, రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలిపేందుకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసి కట్టుగా ముందుకు రావాలన్నారు. సమాజంలో మంచి దిశ, అహింస, ధర్మం వంటి మార్గలను చూపిస్తూ సమాజంలో హక్కులు చూపించే మార్గాన్ని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు చూపించారన్నారు. ఆ మార్గాన్ని నమ్మి ఆర్యవైశ్యులు ముందుకు సాగుతున్నరని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది, ఎఏంసి వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, ఏఐసిసి సభ్యులు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, డీఎంహెచ్వో పి వెంకటరమణ, సంక్షేమ అధికారి కే నరసింహారావు, యువజన సంక్షేమ అధికారి వెంకట్ రెడ్డి,ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వర రావు, కోశాధికారి లక్ష్మీకాంత్, పట్టణ అధ్యక్షుడు మంచాల రంగయ్య, కార్యదర్శి కలకోట లక్ష్మయ్య, బండారు రాజా, తోట శ్యాం ప్రసాద్ ఆర్యవైశ్య సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.






