10 July, 2026 | 3:09 AM

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం విఫలం..

10-07-2026 01:57 AM

బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్

వనపర్తి, జులై 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల అమలులో పూర్తిగా విఫలమైందని, ప్రచారానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ లు విమర్శించారు.

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు విడుదల కాకపోవడంతో అప్పుల పాలై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు. ఘనపూర్ మండలం వెంకటాంపల్లి గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు సిద్ధి రాము అప్పులు, వ్యవసాయ నష్టాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబానికి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయడంతో పాటు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారు కోరారు. ఇంది రమ్మ ఇళ్ల కోసం ప్రస్తుతం ఇస్తున్న రూ.5 ల క్షల ఆర్థిక సహాయం ఇంటి నిర్మాణానికి ఏ మాత్రం సరిపోదని, దానిని రూ.10 లక్షలకు పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇలాంటి విషాద ఘటనలు మరిన్ని చోటుచేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో గంధం పరంజ్యోతి, హేమంత్ ముదిరాజ్, జోహెబ్ హుస్సేన్, సునీల్ వాల్మీకి, సయ్యద్ జమీల్, నీలస్వామి, అలీమ్ తదితరులు పాల్గొన్నారు.