అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి
ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
మంత్రి కొండా సురేఖ..
పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు,
డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి
సికింద్రాబాద్, జూలై 10 (విజయక్రాంతి): సికింద్రాబాద్ ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో నిర్వహించనున్న ఆషాఢ బోనాల మహోత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, దేవాలయ ఈవో మనోహర్ రెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఉజ్జయిని మహాకాళి బోనాల మహోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. లక్షలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చే నేపథ్యంలో దర్శన ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, విద్యుత్ సరఫరా, వైద్య సేవలు, అగ్నిమాపక భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, అత్యవసర సేవలు తదితర అంశాల్లో ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. ఉజ్జయిని మహాకాళి ఆలయం తెలంగాణ ప్రజల విశ్వాసానికి ప్రతీక అని, రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు విచ్చేస్తారని అన్నారు.
వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమిష్టిగా పనిచేసి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న ఏర్పాట్లు భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా ఉండాలని ఆకాంక్షించారు.ఈ సమావేశంలో పోలీస్ శాఖ, ట్రాఫిక్ పోలీస్, జీహెచ్‌ఎంసీ, దేవాదాయ శాఖ, వాటర్ వరక్స్, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు, ఇతర సంబంధిత విభాగాల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






