సామాజిక సంక్షేమానికి కేంద్ర నిధుల సాధనే లక్ష్యం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కలిసిన పేరం శివనాగేశ్వర రావు
ముషీరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని సామాజిక సంక్షేమ రంగ అభివృద్ధికి కేంద్ర నిధులు సాధించడమే లక్ష్యంగా ఈ నెల 15న హైదరాబాద్లో రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర నిధుల సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథవాలే) జాతీయ కార్యదర్శి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఇన్చార్జి పేరం శివ నాగేశ్వర రావు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి సమావేశం వివరాలను వెల్లడించినట్లు బుధవారం తెలిపారు.
జూలై 15న టూరిజం ప్లాజాలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నట్లు పేరం శివ నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థుల విద్యా అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్ర మౌలిక సదుపాయాల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధుల సాధనపై సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నట్లు చెప్పారు.
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సమన్వయంతో సంక్షేమ పథకాల అమలును మరింత సమర్థవంతంగా చేసే దిశగా కార్యాచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సంక్షేమ హాస్టళ్ల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ క్లాస్రూమ్ల ఏర్పాటు, విద్యార్థులకు నాణ్యమైన వసతి, విద్యా సౌకర్యాల కల్పన కోసం కేంద్ర సామాజిక న్యాయ శాఖ నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని సమావేశంలో కోరనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్వో టి.రాజ్కుమార్ పాల్గొన్నారు.






