చెలిమిల్ల గ్రామస్థుల ఔదార్యం
బ్రెయిన్ స్ట్రోక్ బాధితుడికి రూ.65 వేల సాయం
పెబ్బేరు, జూన్ 24: మున్సిపాలిటీ పరిధిలోని చెలిమిల్ల గ్రామస్థులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ గౌడ్ బ్రెయిన్ స్ట్రోక్కు గురై కర్నూల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స ఖర్చుల వల్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో బాధితుడి కుమారుడు ఆవుల భరత్ గౌడ్ గ్రామ వాట్సాప్ గ్రూపులో సహాయం కోరుతూ సందేశం పంపించారు. దీనికి స్పందించిన గ్రామస్థులు ఫోన్పే ద్వారా విరాళాలు అందించారు.
గ్రామ ప్రజల సహకారంతో మొత్తం రూ.65 వేల వరకు ఆర్థిక సాయం సమకూరింది. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి గ్రామస్థులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. అందరి సహకారానికి బాధిత కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సహాయ సహకారాలు సమాజంలో మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తాయని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఈ ఘటన గ్రామంలో ఐకమత్యానికి, పరస్పర సహకారానికి ఉదాహరణగా నిలిచింది.






