15 May, 2026 | 1:41 AM

ప్రభుత్వాన్ని కూల్చడానికే పేలుళ్లు

15-05-2026 12:51 AM
  1. దీనికి ‘ఆపరేషన్ హెవెన్లీ హింద్’ పేరు!
  2. ఢిల్లీలో ఎర్రకోట వద్ద కారుబాంబు కేసులో మొత్తం నిందితులు 11 మంది
  3. వీరందరికీ ఆల్‌ఖైదాతో లింకులు
  4.   7500పేజీలతో ఎన్‌ఐఏ ఛార్జిషీట్
  5.   588 మంది నుంచి వాంగ్మూలాల నమోదు
  6. ఢిల్లీ కోర్టుకు సమర్పించిన జాతీయ దర్యాప్తు సంస్థ

న్యూఢిల్లీ, మే 14: గతేడాది యావత్ దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసిన ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 7500 పేజీల తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. మొత్తం 10 మం దిని నిదితులుగా తేల్చింది. వీరందరికీ ఆల్‌ఖైదాకు అనుబంధసంస్థతో లింకులు ఉన్న ట్లు స్పష్టం చేసింది. భారత్‌లో ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా నిందితులు ఈ పేలుడుకు ఒడిగట్టినట్లు పేర్కొంది.

దీనికి ‘ఆపరేషన్ హెవెన్లీ హింద్’ అని పేరుపెట్టినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీలోని పాటియాలా కోర్టులో గురువారం ఛార్జీషీట్‌ను జాతీయ సంస్థ సమర్పించింది. 2025 నవంబర్ 10న దేశరాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. ఈ కేసులో ఎన్‌ఐఏ 7500 పేజీ ల ఛార్జీషీట్‌ను రూపొందిం చి గురువారం ఢిల్లీ కోర్టుకు సమర్పించింది.

ప్రధాన సూత్రధారి ఉమర్ ఉన్ నబీతో (పేలుడులో అతడు మరణించాడు) పాటు మొత్తం 10 మందిని నిందితులుగా చేర్చింది. దర్యాప్తులో భాగంగా జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీలో ఎన్ ఐఏ సోదాలు జరిపింది. 588 మంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేసింది. 395కు పైగా పత్రాలు, 200కు పైగా స్వాధీనం చేసుకున్న పరికరాల నుంచి సాక్ష్యాలు సేకరించినట్లు ఛార్జీషీట్‌లో పేర్కొంది.

ఈ పేలుడు వెనుక జిహాదీ కుట్ర కోణం ఉన్నట్లు ఫోరెన్సిక్, సాంకేతిక ఆధారాలు స్పష్టం చేశాయని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 11 మందిని అరెస్ట్ చేసింది. అయితే ఇందులో అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ అనుబంధ సంస్థ అన్నార్ గజ్వాఉల్ హింద్ తో నిందితులకు లింకులు ఉన్నాయని ఎన్‌ఐఏ తెలిపింది. ఈ సంస్థ అల్-ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్కాంటినెంట్ (ఏక్యూఐఎస్) అనుబంధ సంస్థ అని ఎన్‌ఐఏ వెల్లడించింది.

అయితే ఏ క్యూఐఎస్, దాని అనుబం ధ సంస్థలను 2018 జూన్‌లో భారత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిన ట్లు తెలిపింది. వీరంతా భారత ప్రభుత్వాన్ని కూలదోసి షరియా పాలనను అమలు చేయడానికి కుట్రలు పన్నారని పేర్కొంది. ఇందుకోసం మారణాయుధాలను కూడా సమకూర్చుకున్నట్లు తెలిపింది.

వీరంతా 2022లో శ్రీనగర్‌లో సమావేశమయ్యారని, అక్కడే ఓ కొత్త ముఠాను ఏర్పాటుచేసినట్లు ఛార్జీషీట్‌లో పేర్కొంది. దీనికి ‘ఆపరేషన్ హెవెన్లీ హింద్ అని పేరు పెట్టినట్లు ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన, పరారీలో ఉన్నవారిని పట్టుకునేందకు ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. 

ల్యాబ్‌ల్లో మదర్ ఆఫ్ సైతాన్

ఈ ఆపరేషన్‌లో భాగంగా నిందితులు ఉగ్ర కుట్రల కోసం కొత్త నియామకాలు చేపట్టారని, ఆయుధాలు, మందుగుండు సామ గ్రిని నిల్వ చేసుకోవడంతో పాటు పేలుడు పదార్థాలను సొంతంగా తయారుచేసుకున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. వైద్యవృత్తిలో ఉన్న నిందితులు వక్రమార్గం పట్టి తమ నైపుణ్యాలను పేలుడు పదార్థాల తయారీకి వినియోగించినట్లు, తమ ఇళ్లు, ల్యాబ్లను హబ్‌లుగా మార్చుకున్నట్లు స్పష్టం చేసింది. ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ (టీఏటీపీ)ని కూడా వీరు ల్యాబ్‌లో తయారుచేసిన ట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో గుర్తించింది. దీన్ని మదర్ ఆఫ్ సైతాన్‌గా పిలుస్తారు. జమ్మూకశ్మీర్తో పాటు దేశవ్యాప్తంగా భద్రతా స్థావరా లే లక్ష్యంగా దాడులు చేయాలని కుట్రలు చేశారు.