29 June, 2026 | 2:46 AM

యూరియా సరఫరాలో ప్రభుత్వాలు విఫలం

29-06-2026 01:45 AM
  1. యాప్ విధానం రద్దు చేయాలి
  2. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
  3. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
  4. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా

చొప్పదండి, జూన్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని, యూరియా సరఫరాలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మాజీ ఎమ్మె ల్యే సుంకే రవిశంకర్ విమర్శించారు.

ఆదివారం చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో యూరియా కొరతను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకుని గంగాధర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో రాష్ట్ర ప్రభుత్వం కాగితాలపై యూరియా నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులకు ఒక్క బస్తా కూడా అందని పరిస్థితి నెలకొందన్నారు.

ప్రస్తుతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద కేవలం 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉందని, ఇది రాష్ట్ర అవసరాలకు ఏమాత్రం సరిపోదన్నారు. ఖరీఫ్ సీజన్ కోసం తెలంగాణ ప్రభుత్వం 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కోరగా కేంద్రం కేవలం 10 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం చేసిందన్నారు. యూరియా కొనుగోలు యాప్‌ను వెంటనే రద్దు చేసి పాత విధానంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని డిమాండ్ చేసిన సుంకే రవిశంకర్, ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడితో పాటు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చ రించారు. రైతు పక్షాన బీఆర్‌ఎస్ చివరి వరకు పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.