10 July, 2026 | 4:13 AM

రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం

10-07-2026 12:00 AM
  1. సీఎం రేవంత్‌రెడ్డి సొంత సర్వేలోనూ ఇదే తేలింది
  2. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌కు 78 సీట్లు
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనమైందని, ఇదే అంశం సీఎం రేవంత్ రెడ్డి చేయించుకున్న సొంత సర్వేలోనూ తేలిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్ సుమారు 78 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ సర్వేలో తేలిందన్నారు. దీంతో పాటు రెండు మీడియా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగాలు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం సుస్పష్టంగా వ్యక్తమైందన్నారు.

మరోసారి ప్రజలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని స్పష్టంగా తమ అభిప్రాయం చెప్పిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. అయితే, తన సొంత సర్వేతో పాటు పలు సర్వేల్లో వ్యక్తమైన ప్రజావ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత వారం రోజులుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. గురువారం హైదరా బాద్ జీహెచ్‌ఎంసీ నగర నేతలు, ప్రజాప్రతినిధులతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నివాసంలో జరిగిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

సీఎం తన పరిపాలన వైఫల్యాలను ముఖ్యంగా కప్పిపుచ్చుకునేందుకు అనేక అటెన్షన్ డైవర్షన్ పనులు చేస్తున్నారని, అందులో భాగంగానే కాళేశ్వరం నుంచి మొదలుకొని రైతుబంధు వరకు అన్నింటిపైన అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన గ్యారంటీల అమలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైనందువల్లనే తెలంగాణలోని సబ్బండ వర్గాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై నమ్మకం కోల్పోయారని తెలిపారు.

దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా స్పష్టంగా ప్రజలు బీఆర్‌ఎస్ కావాలని కోరుకుంటున్నారని, బీజేపీ లాంటి ఇతర పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ జారుడు బండపైన నిలబడిందని, ఇక పుంజుకునే అవకాశమే లేదన్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, కాంగ్రెస్ పార్టీ ప్రజామోదం పొందడం అత్యంత కష్టమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. 

సర్ అత్యంత కీలకం

హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమం పైన ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ నియమించిన బూత్ లెవెల్ ఆఫీసర్లకు(బీఎల్‌వోలకు) సరైన శిక్షణ, తగిన ఏర్పాట్లు ఇవ్వకపోవడంతో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సర్ కార్యక్రమం అత్యంత మందకొడిగా సాగుతున్నదని చెప్పారు. దీనివల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఫీడ్ బ్యాక్ వస్తోందన్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ లాంటి అత్యధిక జనసాంద్రత ఉండే మహానగరంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫారాల పంపిణీ, వాటిలో ఓటర్ల నమోదు వంటి అంశాలపై సరైన అవగాహన లేకుండానే అధికారులను కేటాయించారని కిందటి స్థాయి నుంచి పార్టీ వర్గాలు ఇస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను కేటీఆర్ ప్రస్తావించారు. అయితే సర్ అత్యంత కీలకమైన అంశమని.. ‘ఒక వ్యక్తికి ఒకే ఓటు’ ఉండాలన్న రాజ్యాంగ స్ఫూర్తి ఆధారంగా దొంగ ఓట్లు లేకుండా చూడాలని కోరారు.

ఒకవైపు మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉపఎన్నికల సందర్భంగా భారీగా బయటపడిన డబుల్ ఓట్లు, దొంగ ఓట్ల వ్యవహారాన్ని ప్రతి ఒక్క నాయకుడు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సర్‌కు సంబంధించి పార్టీ నియమించు కున్న బూత్ లెవెల్ అసిస్టెంట్ల(బీఎల్‌ఏ) సహకారంతో ఏ ఒక్కరి ఓటు కూడా పోకుండా చూడాలన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నందువల్ల డబుల్ ఓట్ల నమోదు లేదా ఇతర ప్రాంతాల వారిని ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు చేయించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి సందర్భంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారుల ఓట్లు పోయేలా ప్రయత్నం చేసే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి ఓటు నమోదయ్యేలా చూడాలని, ఏ ఒక్కరి ఓటు అన్యాయంగా తొలగించబడకుండా చూడాలన్నారు. దీంతోపాటు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న డబుల్ ఓట్ల పైన పార్టీ శ్రేణులు దృష్టి సారించాలన్నారు.