యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్
భిక్కనూర్, మే 15(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో యువత చెడు వ్యసనాలు, సెల్ఫోన్లకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో క్రికెట్ టోర్నమెంట్ (పెద్దమల్లారెడ్డి ప్రీమియర్ లీగ్ ) నిర్వహిస్తున్నారు. వేసవి సెలవుల్లో చిన్నా, పెద్దలు ఫోన్లకు పరిమితమవుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కోడూరి సాయగౌడ్ మాట్లాడుతూ యువత క్రీడల వైపు మొగ్గుచూపేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ క్రీడలు ఆడటం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా మారడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. టోర్నమెంట్ నిర్వహణకు గ్రామ పెద్దలు, పాలకవర్గ సభ్యులు ముందుకు వచ్చి అవసరమైన సౌకర్యాలు కల్పించారు. గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొనడంతో గ్రామంలో క్రీడా సందడి నెలకొంది. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చైతన్య, కొండల్ రెడ్డి, వార్డు సభ్యుడు ఈర స్వామి, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.






