16 May, 2026 | 2:18 AM

‘హై స్పీడ్ రైలు’పై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

16-05-2026 12:20 AM

అధికారులను ఆదేశించిన సీఎస్ రామకృష్ణారావు

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ భాగస్వామ్యంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత హై స్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులకు శుక్రవారం సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు.

ప్రాజెక్టు రిపోర్టులు, ప్రాజెక్టు అమలులో అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో కలసి పనిచేయాలని, ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, కనెక్టివిటీ, మౌలిక వసతుల అభివృద్ధి, ఇతర అంశాలపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు ప్రధాన నగరాలకు అనుసంధానించే హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు వలన తెలంగాణ రైజింగ్ 2047 ఎకనామిక్ గ్రోత్ కారిడార్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు.

హైదరాబాద్  పూణే ముంబై హై స్పీడ్ రైల్ మార్గానికి సంబంధించి డీపీఆర్ సిద్ధం అయిందని రైల్వే అధికారులు తెలిపారు. సూమారు 671 కి. మీటర్ల మార్గానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, తెలంగాణ రాష్ట్రంలో 93 కి. మీటర్ల మేరకు భూ సేకరణ అవసరం ఉంటుందని, అదేవిధంగా హైదరాబాద్ కారిడార్, హైదరాబాద్ కారిడార్‌లో సూమారు 123 కి.మీటర్ల నిడివిలో భూసేకరణ అవసరమని, కోకాపేట, శంషాబాద్ ప్రాంతాలలో రైల్వే డిపోలకు కొంత భూసేకరణ చేయాలని అధికారులు పేర్కొన్నారు.

వీటికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ, హెచ్‌ఎండీఏ, జీఎంఆర్ ఎయిర్ పోర్టు అధికారులు కేంద్ర రైల్వే ప్రాజెక్టు అధికారులతో సమన్వయం చేసుకొని హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్‌కు సహకరించాలన్నారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, కేంద్ర రైల్వే శాఖ అధికారులు, జీఎంఆర్ ఎయిర్ పోర్టు అధికారులు పాల్గొన్నారు.