బస్టాండ్ నిర్మాణం కలేనా?
- ప్రయాణికుల తిప్పలు పట్టించుకోని అధికారులు
- రోడ్డుపైనే ఆర్టీసీ బస్సులు
- బస్సుల కోసం రోడ్డుపైనే ప్రయాణికుల నిరీక్షణ
- మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక అవస్థలు
బెజ్జూర్, మే 15 (విజయ క్రాంతి):ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా బెజ్జూర్ బస్టాండ్ నిర్మాణం కలగానే మిగిలిందని ప్రయాణికులు వాపోతున్నారు. మండల కేంద్రానికి ఆసిఫాబాద్, కాగజ్నగర్ మాత్రమే కాకుండా మహారాష్ట్ర ప్రాంతాలకు సైతం ఆర్టీసీ బస్సులు పదుల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. కానీ మండల కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో ఎండాకాలం, వానాకాలం, చలికాలం అన్న తేడా లేకుండా ప్రయాణికులు రోడ్డుపైనే బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.బస్సుల సమయ పట్టిక బోర్డు కూడా లేకపోవడంతో ఏ బస్సు ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండే సమయంలో మహిళలు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పలుమార్లు మండలంలో బస్టాండ్ నిర్మాణం చేపడతామని అధికారులు హామీలు ఇచ్చారే తప్ప ఆచరణలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించలేదని పలువురు ఆరోపిస్తున్నారు.
ఆసిఫాబాద్ జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ బెజ్జూర్ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం కోసం స్థల పరిశీలనకు వచ్చినప్పటికీ, స్థానిక నాయకులు స్థలం చూపించకపోవడంతో పలుమార్లు తిరిగి వెళ్లిపోయారని సమాచారం.బస్టాండ్ నిర్మాణం కోసం గ్రామపంచాయతీ సర్పంచ్, పాలకవర్గం, గ్రామ ప్రజలు స్థలం కేటాయిస్తూ తీర్మానం చేసి ఇస్తే, బస్టాండ్ మంజూరు కోసం నివేదిక పంపించి కృషి చేస్తామని అధికారులు తెలిపినట్లు సమాచారం. నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యేక చొరవ తీసుకొని బెజ్జూర్ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
బస్టాండ్ నిర్మించాలి.. మౌలిక వసతులు కల్పించాలి
మండల కేంద్రంలో బ స్టాండ్ లేకపోవడంతో ప్ర తి రోజూ వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు లేక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే బస్టాండ్ నిర్మాణం చేపట్టి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
మాండూరి బాలకృష్ణ






