16 May, 2026 | 1:52 AM

పప్పుల సాగు సమస్యే!

16-05-2026 12:47 AM
  1. పెరుగుతున్న వరి..  తగ్గుతున్న పప్పు ధాన్యాల ఉత్పత్తి 
  2. పదేళ్లలో 131.7 శాతం పెరిగిన వరి ఉత్పత్తి 
  3. 39 శాతానికి పడిపోయిన పప్పు ధాన్యాల పంటల సాగు 
  4. పంట మార్పిడిపై ప్రభుత్వ ప్రయత్నం ఫలించేనా!

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో వరి ధాన్యం ప్రతి ఏటా పెరుగుతుండగా, కూరగాయలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల వంటి పంటల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. తెలంగాణ భూములు అన్ని పంటల సాగుకు యోగ్యంగా ఉన్నప్పటికీ.. రైతులు కొన్ని పంటలకే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో రాష్ట్ర అవసరానికి సరపడా తెలంగాణలోనే వరి తో పాటు వివిధ రకాలు పంటలు ఉత్పత్తి అయ్యేది. 

ఇప్పు డు రాష్ట్ర అవసరాలకు సంబంధించి కూరగాయలు, పప్పు ధాన్యాలు, ఇతర నూనె గింజలపై పక్క రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. 2013-- 14 సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు సాగు వివరాలను గమనిస్తే   వరి సాగు విస్తీర్ణం 131.7 శాతం పెరిగితే..  పప్పు ధాన్యాల సాగు 39 శాతానికి పడిపోయినట్లుగా  వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి.

అయితే  రాష్ట్ర  అవసరాల కోసం పక్క రాష్ట్రాలపై ఆధారపడకుండా, మన రాష్ట్రంలోని కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగును పెంచే విధంగా వ్యవసాయశాఖ, అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు నిమగ్నమయ్యారు.  రైతులు ఒకే రకమైన పంటను ఎక్కువగా వేయడంతో భూసారం తగ్గడంతో పాటు, యూరియా వాడకంతో పంటల ఉత్పత్తులు తగ్గుతుందనే చెబుతున్నారు.

వీటితోపాటు పంట మార్పిడి చేయాలని, అందుకు రైతులకు అవగాన కల్పించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఎక్కువ గా వరి ఉత్పత్తి చేస్తున్న రైతులు పప్పు ధాన్యాల వైపు మళ్లుతారా..? అనేది ప్రశ్నగా మారింది. పప్పు ధాన్యాల్లో కొన్నింటి సాగును.. గత పదేళ్లుగా పరిశీలిస్తే ఉలవలు 71.6, సజ్జలు 95, బొబ్బర్లు 72.4, నువ్వులు 94.9, పొద్దుతిరుగుడు 98.5, ఆముదం 98.5 వేరుశనగ 51, పెసళ్లు 75.2, మినుములు 71.5 శాతాలకు పడిపోయింది. 

వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళిక.. 

వచ్చే వర్షాకాలనికి సంబంధించి వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళికలను రూపొందిస్తున్నది. ఈసారి ఎల్‌నీనో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉంటుదన్న వాతావరణశాఖ నిపుణుల చెబుతుండటంతో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది.

సాధారణంగా రాష్ట్రంలో దక్షిణా తెలంగాణ కన్నా ఉత్తర తెలంగాణలో అధిక వర్షపాతం నమోదవుతుంది. అయితే  వచ్చే వర్షాకాలంలో ఉత్తర తెలంగాణలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దక్షిణ తెలంగాణ అతి తక్కువ వర్షాపాతం నమోదు అవుతుందని  తావారణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

జిల్లాల వారిగా అక్కడి వాతావారణం, వర్షాపాతాల అంచనాల ఆధారంగా రైతులు ఏ ఏ పంటలు వేయాలో తెలిపే విధంగా సమగ్ర పంటల ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తున్నది.  అయితే మార్కెట్లో కాంప్లెక్స్ ఎరువుల ధర అధికంగా ఉండటం, కాంప్లెక్స్ ఎరువుల కన్నా.. యూరియా ధరలు తక్కువకు దొరకడంతో రైతులు కాంప్లెక్స్ ఎరువులకు బదులు యూరియాను అధికంగా వినియోగిస్తున్నట్టు  అధికారులు చెబుతున్నారు.