ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ
చైర్మన్‌గా కేశవరావు, మరో ఐదుగురు సభ్యులు
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి) : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారి సేవలు-, త్యాగాలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం జీఓ నం. 679ను జారీ చేసింది. ఉద్యమంలో కొందరు ప్రాణత్యాగం చేయగా, మరికొందరు శారీరక వైకల్యానికి గురయ్యారు. పలువురిపై కేసులు నమోదై జైలు జీవితం గడిపారు.
ఈ నేపథ్యంలో వారి సేవలను అధికారికంగా గుర్తించాలనే డిమాండ్ చాలాకాలంగా ఉండంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమకారుల కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములునాయక్, మోతె శోభన్‌రెడ్డి నియమితులయ్యారు.
కమిటీ కన్వీనర్‌గా సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్ సెక్రటరీ వ్యవహరిస్తారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ముందుగా స్పష్టమైన ప్రమాణాలను రూపొందించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. వారికి ఎలాంటి గుర్తింపు, గౌరవం, సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది.
త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
కమిటీ అవసరమైతే అధికారులను పిలిపించుకోవచ్చు. సమాచారం సేకరించవచ్చు. సమావేశాలు నిర్వహించవచ్చు. అవసరమైన ఇతర వ్యక్తులు, అధికారులను కూడా సంప్రదించవచ్చు. కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి వీలైనంత త్వరగా సమర్పించాలి ’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు, కార్యదర్శులు కమిటీకి అవసరమైన సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.






