గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల, మే -15 ( విజయక్రాంతి)విద్యార్థులందరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు . ముందుగా లైబ్రరీ లో చదివి ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తకాలను పరిశీలించారు.
కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. లైబ్రరీ అనేది చదువుకునేందుకు మంచి అవకాశమని, మిగతా వారితో పోటీ పడే స్పూర్తి పొందుతారని పేర్కొన్నారు. తాను కూడా లైబ్రరీలో చదివానని గుర్తు చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులు వార్త పత్రికలు చదవాలని సూచించారు. దీంతో అన్ని విషయాలపై అవగాహన వస్తుందని వివరించారు.
యువత సోషల్ మీడియా కు దూరంగా ఉంటూ లక్ష్య సాధన పై దృష్టి సారించాలని అన్నారు. గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.తెలంగాణ ప్రభుత్వం కృషితో గ్రంథాలయాలను అభివృద్ధి బాటలో తీసుకు వెళుతున్నామని తెలిపారు. గ్రంథాలయంలో చదువుకొని దాదాపు 150 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని, చాలా గ్రామాల్లో పబ్లిక్ రీడింగ్ రూమ్ లను ఏర్పాటు చేసి గ్రామీణ పాఠకులకు గ్రంథాలయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.






