15 June, 2026 | 3:19 AM

పదేళ్లలో బీఆర్‌ఎస్ ‘దోపిడీ’ సినిమా

15-06-2026 02:00 AM
  1. ఇందిరమ్మ రాజ్యంతో కేటీఆర్ మైండ్ బ్లాంక్
  2. బీఆర్‌ఎస్ గత పాలనపై ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆగ్రహం

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): కేసీఆర్ కుటుంబం పదేళ్లు కష్టపడి తెలంగాణలో ‘దోపిడీ’ అనే సినిమాను రూపొందించిందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం సినిమా చూశాక కేటీఆర్ దిమ్మతిరిగిపోయి మైండ్ బ్లాంక్ అయిందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ విధానాలు, కేటీఆర్ పని విధానం నచ్చకనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే వాళ్లకు దూరంగా ఉంటున్నారని, కేటీఆర్ చేతకాని తనం వల్లనే ఇలా జరిగిందన్నారు. దానికి సీఎం రేవంత్ రెడ్డిని నిందిస్తున్నారని మండిపడ్డారు.

ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వేముల వీరేశం మాట్లాడారు. సీఎంపై కేటీఆర్ సిల్లీ కామెంట్స్ చేస్తున్నారని, అసత్యాలు చెప్పడమే ఆయనకు పనిగా మారిందని విమర్శించారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం ఒక శాపంలా తయారైందని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల కుప్పగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు శనివారం, ఆదివారం సెల్ ఆఫ్ చేసుకునేవారని, ప్రస్తుత సీఎం ఆదివారం కూడా సెలవు తీసుకోవడం లేదన్నారు.

ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కోసమే హైడ్రాను తీసుకువచ్చామని, వేలకోట్ల ప్రభుత్వ ఆస్తులను హైడ్రా కాపాడిందని తెలిపారు. బీఆర్‌ఎస్ వల్లే తెలంగాణ దెబ్బతిందని, యువత భావోద్వేగాలకు గురై బలయ్యారని, ఆ చితిమంటలపై చలికాచుకునే నైజం ఆ పార్టీదేనని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు శ్రీరామరక్ష అని వేముల వీరేశం పేర్కొన్నారు.