ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇండ్ల కూల్చివేతలా?
పేదలు గూడు కోసం ఉద్యమించేది కమ్యూనిస్టులే
సీపీఐ నేతలు చాడ వెంకటరెడ్డి, తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు
వరంగల్ (మహబూబాబాద్), జూలై 3 (విజయక్రాంతి): పేదలకు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి రాగానే వారి గూడును కూల్చివేయడం దుర్మార్గమని, ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇండ్ల కూల్చివేతలేనా అని సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహయ కార్యదర్శి తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా పరిధిలోని గుండ్ల సింగారంలోని సురవరం సుధాకర్ రెడ్డి నగర్ లో ఇండ్ల కూల్చివేత జరిగినా విశ్రమించకుండా ఇండ్ల స్థలాలు, గూడు కోసం పేదలు చేపట్టిన భూపోరాటంలో వంటా వార్పు కార్యక్రమానికి వారు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి, తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దశాబ్దాలుగా పేదలకు భూములు, గృహ వసతి కోసం కమ్యూనిస్టులే నిరంతరం పోరాడుతున్నారని గుర్తుచేశారు.
నిరుపేదలు ఎంతో ఆశతో కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపిస్తే, నేడు వారి ఇండ్లను కూల్చి రోడ్డున పడేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. నిరుపేదలు నిర్మించుకున్న ఇండ్ల కూల్చివేతలను ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని అన్నారు. హనుమకొండ గుండ్ల సింగారంలో సర్వే నెంబర్లు 174, 175లలో నేడు చెరువు శిఖం భూమి లేనే లేదని, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పేదలకు 1,360 మందికి ఇంటి స్థలాలు ఇచ్చారన్నారు.
గత ఐదేళ్ళుగా అక్కడ పేదలు సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటం నిర్వహించి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని అన్నారు. గుండ్ల సింగారంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్ల స్థలాలు కేటాయించి, పట్టాలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం మొండివైఖరి వీడకపోతే కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భూపోరాటాలను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, రాష్ట్ర సమితి సభ్యురాలు మండ సదాలక్ష్మి, ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, సిపిఐ హనుమకొండ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు వుట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, బత్తిని సదానందం, మునిగాల బిక్షపతి, గ్రామ పెద్దలు గాదె మొగిలి, జన్ను కృష్ణ, సిపిఐ నాయకులు మాలోత్ శంకర్ నాయక్, గుంటీ రాజేందర్, పొనుగోటి రాముగోపాల్ చారి, పెద్ద సంఖ్యలో భూపోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






