మండే.. సూరీడు..
- అంతటా నిప్పుల కొలిమి...
- సుర్రు మంటున్న సూరీడు...
- మండే ఎండలతో... జనం ఉక్కిరి బిక్కిరి...
- పగటి వేళలో రోడ్లన్నీ ఖాళీ...
- ఆస్పత్రులకు వడదెబ్బ బాధితుల తాకిడి...
- ఇంటి నుండి బయటకు రావద్దంటూ అధికారుల హెచ్చరికలు...
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరింత పెరిగిన ఉష్ణోగ్రతలు...
- రెడ్ జోన్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా...
బాన్సువాడ, మే 3 (విజయ క్రాంతి): రాష్ట్రమంతటా నిప్పుల కొలిమి అయింది. సూర్యుడు సుర్రుమంటుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉక్క పోతతో ఉడికిపోతున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉండడంతో ఎండల తీవ్రత మరింత అధికమవుతుంది. తగు జాగ్రత్తలతోనే జనం కాలు బయట పెట్టాల్సి వస్తుంది. మరో వారం రోజులపాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తుంది.
ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతుండడంతో చిన్నారులు వృద్ధులు వడదెబ్బ తాకిడికి లోనవుతున్నారు. కూలి నాలి చేసుకునే సామాన్య ప్రజలు వాంతులు విరోచనాలతో చతికిల పడుతున్నారు. వడదెబ్బ ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు లోనై ఆసుపత్రుల పాలవుతున్నారు.సూర్యోదయం నుంచే బాణుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడం, ఎండలు తీవ్రంగా కాస్తుండడంతో జనం గుమ్మం దాటాలంటేనే జంకుతున్నారు.
ప్రస్తుతం45.0 సెల్సియస్ దాటి ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతూ వస్తున్నాయి. మరో వారం రోజులు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 45 నుండి 50 దాట వచ్చిన కూడా చెబుతోంది. సూర్యోదయం నుండి భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
ప్రధాన కూడల్లు, ఆర్టీసీ బస్టాండ్లు సైతం వెలవెల బోతున్నాయి. ఎండ తాకిడికి తట్టుకోలేక వ్యాపారస్తులు సైతం దుకాణ సముదాయాలను మూసివేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇప్పటికి రెడ్ జోన్ లోకి వెళ్లిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి...
ఉష్ణోగ్రతల ప్రభావం ప్రజల మీద పడొద్దు అనుకుంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా అధికారులు ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ముఖ్యమైన పనులు ఉంటేనే బయటకు రావాల్సి ఉంటుందని, అకారణ చేత ఎండలో తిరిగి అనారోగ్య బారిన పడవద్దని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు సైతం ఈ విషయంలో పలు సూచనలు సలహాలు అందిస్తున్నారు. గ్రీష్మ తాపాన్ని తట్టుకునేందుకు చలువ చేసే పానీయాలను సేవించాలని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్త పడాలన్నారు.
నిర్మానుష్యంగా రోడ్లు,ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు...
సూర్యుని ప్రతాపానికి రహదారులన్నీ రాకపోకలు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కుడలు సైతం జనం తాకిడి లేక వేలవేల బోతున్నాయి. ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్టాండ్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రత ఆర్టీసీ ఆదాయం పై కూడా గండి పడింది. ప్రయాణికుల సందడి లేక ఆర్టీసీ బస్సులు ఖాళీగా పరుగులు పెడుతున్నాయి.
ఆసుపత్రులకు వడదెబ్బ బాధితుల తాకిడి...
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వడదెబ్బ బాధితుల తాకిడి మొదలైంది. వడదెబ్బతో తీవ్రమైన జ్వరంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. వాంతులు విరోచనాలతో మంచాన పడుతున్నారు. ఎండల తాకిడితో కూలీలు సైతం అస్వస్థతకు లోనవుతున్నారు. వ్యవసాయ రైతులు కూడా అపసోపాలు పడుతున్నారు. ఆసుపత్రులకు వచ్చే వడదెబ్బ బాధితులకు వైద్యులు సకాలంలో వైద్య పరీక్షలు చేసి చికిత్సలు అందిస్తున్నారు. పరిస్థితిని చూసి అదుపుతప్పితే జిల్లా కేంద్రాలకు వడదెబ్బ బాధితులను తరలిస్తున్నారు.
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి...
వేసవి తాపంతో జనం ఇళ్లల్లో కూడా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సామాన్య పేదరిక కుటుంబాల్లో మాత్రం ఇళ్లల్లో ఉండలేక పంట పొలాల్లోని చెట్ల కింద సేద తీరుతున్నారు. ఏసీలు కూలర్లు ఫ్యాన్లు సహాయంతో ప్రజలు కాసింత ఉపశమనం పొందుతున్నారు. అయినప్పటికీ ఎండ పొడ ఇళ్లల్లోకి రావడంతో చిన్నపిల్లలు మహిళలు ఉడకపోతతో అవస్థలు పడుతున్నారు.
శీతల పానీయాలకు భలే గిరాకి
వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు శీతల పానీయాలపై దృష్టి సారిస్తున్నారు. తడారి పోతున్న గొంతును తడుపుకునేందుకు మజ్జిగ, నిమ్మరసం, ఆరెంజ్, చెరుకు రసం, పండ్ల రసాల వైపు పరుగులు పెడుతున్నారు. అదేవిధంగా శీతల పానీయాల గిరాకి మరింత పెరిగింది. దీంతోపాటు వైన్ షాపుల్లో బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పురుషులు యువత బీర్లను సేవించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. వేసవి కాలంలో ఎప్పుడు లేనంతగా బీర్లు అమ్మకాలు పెరిగినట్లు లిక్కర్ వ్యాపారులు పేర్కొంటున్నారు. బిర్లా అమ్మకాలు పెరగడంతో నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తుంది అని కూడా చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల సలహాలు...సూచనలు...
దేహంలోని వేడిని తగ్గించడానికి, డీహైడ్రేషన్ నివారించడానికి క్రమం తప్పకుండా నీరు, పండ్ల రసాలు తాగాలి.ఆహార నియమాల అంశానికి వస్తే తేలికగా జీర్ణమయ్యే ఆహారం, పుచ్చకాయ, దోసకాయ, కొబ్బరి బొండం వంటివి తీసుకోవాలి. కారం పొడి, ఆవకాయ, వేపుళ్లు తగ్గించాలి. వేసుకునే బట్టల విషయంలో కాటన్ బట్టలు, లేత రంగు దుస్తులు ధరించాలి. ఎండలోకి వెళ్లేటప్పుడు గొడుగు, కళ్లద్దాలు, టోపీ, సన్స్క్రీన్ వాడాలి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఐస్ వాటర్ ఎక్కువగా తీసుకొక పోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.






