06-02-2026 12:17:56 AM
తగ్గిన సైబర్ నేరాలు
షీల్--2026 వేదికగా అధునాతన సాంకేతిక పరికరాలు ప్రారంభించిన సీఎస్, డీజీపీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): హైదరాబాద్ వేదికగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో గురువారం జరిగిన షీల్డ్-2026 సదస్సులో పలు కీలక ఆవిష్కరణలు జరిగాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకష్ణారావు, డీజీపీ బి.శివధర్ రెడ్డి, టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్.. దేశంలోనే తొలిసారిగా రూపొందించిన మూడు కీలక డిజిటల్ టూల్స్‌ను ప్రారం భించారు.
సైబర్ నేర బాధితుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న 1930 హెల్ప్‌లైన్ నెంబర్‌కు సరికొత్త బలాన్ని చేకూర్చారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 1930 సారథి పేరుతో ఏఐ ఆధారిత వాయిస్ ఏజెంట్ను తెలంగాణ పోలీసులు ప్రవేశపె ట్టారు. ఇది కేవలం ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ మాత్రమే కాదు, బాధితులతో బహుళ భాషల్లో మాట్లాడి, వారి ఫిర్యాదులను వేగంగా స్వీకరించడమే కాకుండా, వారికి తక్షణమే అవసరమైన మార్గనిర్దేశం చేస్తుంది.
దీనివల్ల బాధితులకు వేగవంతమైన సహాయం అందుతుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకష్ణారావు మాట్లాడుతూ.. సైబర్ ముప్పు కేవలం ఒక శాఖకు సంబం ధించింది కాదని, దీనిని ఎదుర్కోవడానికి అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డీజీపీ బి శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపం దాల్చుతున్నా యని, వాటిని ఎదుర్కోవడానికి పోలీసులకు అధునాతన శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని అన్నారు.
షీల్డ్-2026లో ఏర్పాటు చేసిన టెక్నాలజీ ఎక్స్ పీరియన్స్ జోన్ ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో భవిష్యత్ పోలీసింగ్ లో భాగం కానున్న రోబోటిక్ డాగ్స్ , హ్యూమనాయిడ్ రోబోలు, ఫ్లుటై సిములేటర్లు, డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ టెక్నాలజీలను ప్రదర్శించారు. అలాగే సైఫర్ స్ప్రింట్ పేరుతో నిర్వహించిన ఇన్నోవేషన్ ఛాలెంజ్ కు దేశవ్యాప్తంగా 500 టీమ్స్ పోటీపడగా, 17 జట్లు ఫైనల్ కు చేరాయి. విజేతలకు రూ. 5 లక్షల గ్రాంట్ తో పాటు టీజీసీఎస్బీతో కలిసి పనిచేసే అవకాశం కల్పించారు.