2 September, 2026 | 4:16 AM

నెర్రెబారిన వరి.. రైతు ఆశలు ఆవిరి..!

02-09-2026 | 01:48am

వర్షాలు లేక అడుగంటుతున్న జలాలు.. ఆందోళనలో రైతులు..    

సాగు చేసిన పంటను బతికించుకునేందుకు రైతన్న అష్ట కష్టాలు

ఎండిన పంటకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని వేడుకోలు     

చివ్వెంల, సెప్టెంబర్ 1: ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతన్నకు నిరాశే మిగులుతోంది. సరైన సమయానికి వానలు పడకపోవడం, బావుల్లో, బోర్లలో నీళ్లు రోజురోజుకూ అడుగుకి పడిపోవడంతో వరి ఏమవుతుందోనని రైతులు(Farmers) భయపడుతున్నారు. పొలాల్లో పచ్చగా కళ్లకు విందు చేయాల్సిన పంట.. నీళ్లు లేక కళ్లముందే వాడిపోతోంది. కొన్ని చోట్ల బోర్లలో నీళ్లు రాక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి కొందరు రైతుల వరి పొలాలు నెర్రెల బారి రైతులలో ఆశలు ఆవిరగుతున్నాయి.

నీటి కోసం కోటి కష్టాలు : 

సాగునీటి వనరులు లేకపోవడంతో చాలా మంది రైతులు బోర్ల మీద నమ్మకంతోనే వరి వేశారు... ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, దుక్కులు, కూలీల ఖర్చులతో నడుం విరిగిన రైతుకు... పంటను కాపాడుకోవడానికి తిప్పలు పడాల్సి వస్తుంది.

వరి పంట చేతికొచ్చే కీలక సమయంలో నీళ్లు అందక రైతులు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఉన్న కాస్త నీటితోనే పొలాన్ని తడిపేందుకు కోటి కష్టాలు పడుతున్నారు. ఒకరి పొలం నుంచి ఇంకొకరి పొలానికి పైపులేసి నీళ్లను మళ్లిస్తున్నారు. దూరంగా ఉన్న గుంటలు, వనరుల నుంచి నీటిని లాక్కొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి అయినా వెనక్కి వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో.. మళ్లీ మళ్లీ డబ్బులు ఖర్చు పెట్టాల్సి రావడం రైతులను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీస్తోంది.

పొద్దంతా పొలం వద్దే.. : 

చాలా మంది రైతులు వడ్డీలకు అప్పులు తెచ్చి పంట వేశారు. పంట బాగా పండితే ఆ వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చి, కుటుంబాన్ని గడుపుకుందామనే ధీమాతో ఉన్నారు. కానీ ఇప్పుడు నీళ్ల కొరతతో దిగుబడి బాగా తగ్గిపోయేలా కనిపించడంతో ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. పంట పూర్తిగా ఎండిపోతే పెట్టిన పెట్టుబడి కూడా దక్కదని వాపోతున్నారు. అప్పులు ఏ రకంగా తీర్చాలి? వచ్చే పంటకు పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలి? సంసారాన్ని ఎలా ఈదాలి? అని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

మండుటెండను కూడా లెక్కచేయకుండా పొద్దంతా పొలం వద్దే ఉంటున్నారు. బోర్ మోటారు సరిగ్గా నడవక, మడి మడికీ నీరు అందకపోతే పంట ఎక్కడ ఎండిపోతుందోనన్న భయంతో పొలాల వదిలి రావడానికే భయపడుతున్నారు. ఒకవైపు ఇంటి బాధ్యతలు, ఇంకోవైపు కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను కాపాడుకోవాలన్న తాపత్రయంతో నలిగిపోతున్నారు. ఎంతో కష్టపడి పెంచిన పైరు కళ్లముందే వాడిపోతుంటే చూసి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

వాన కోసం ఎదురుచూపులు : 

ప్రారంభంలో కొంతమంది బోర్లు బాగులలో నీరు ఉండడంతో రైతులు అవకాశం ఉన్న కాడికి వరిని నాటారు. అయితే రాను రాను వరుణ దేవుడు కరుణించకపోవడంతో రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో బోర్లు బావుల్లో నీరు సక్రమంగా ఉండడం లేదు. విరసి నాటిన పొలాలు సమృద్ధిగా పారక వాటిలో కొంత భాగాన్ని రైతులు తప్పని పరిస్థితుల్లో వదిలేయాల్సి వస్తుంది. 

ఉన్న పంట నైన పండించుకోవాలనీ వాన కోసం కళ్ళల్లో వేయి ఒత్తులు వేసుకొని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఎండిపోయిన పంటలను అధికారులు సర్వే చేసి తగిన నష్టపరిహారం అందించాలని పలు గ్రామాల రైతుల కోరుతున్నారు.  

నీరు లేక పైరు ఎండుతోంది 

నాకు ఉన్న ఐదు ఎకరాల భూమిలో రెండు ఎకరాల్లో రెండు నెలల క్రితం బోరు నీటితో వరి నాట్లు వేశాను. అప్పట్లో బోరులో నీరు అందుబాటులో ఉండటంతో పంటను సాగు చేయవచ్చనే నమ్మకంతో పెట్టుబడులు పెట్టాను.అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బోరులో నీరు పూర్తిగా అడుగంటిపోవడంతో పంటకు నీరు అందడం లేదు.  కళ్లముందే పంట ఎండిపోతుంటే చూస్తూ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ప్రభుత్వం నాలాంటి రైతులను ఆదుకోవాలి.                       

అమర గాని నాగయ్య, రైతు