వాహనాలకు ట్యాగింగ్!
- సకాలంలో అందుబాటులోకి ఎరువులు
రవాణాను క్రమబద్ధీకరించిన కేంద్రం
అవకతవకలకు.. పాల్పడితే ఈసీ చట్టం ప్రకారం కఠిన చర్యలు
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇప్పటికే సూచనలు
డిమాండ్‌కు అనుగుణంగా ఎరువుల సప్లయ్ పెంచేలా చర్యలు
హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): వ్యవసాయ సీజన్‌లో రైతులు ప్రతి ఏటా ఎరువుల కోసం రోడ్డక్కెడం జరుగుతోంది. ప్రధానంగా యూరియా, ఇతర ఎరువుల కోసం రబీ, ఖరీఫ్ సీజన్‌లో కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఉండటం, చెప్పులు, ఇతర వస్తువులను లైన్లో పెట్టి రైతులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. ఒక వైపు కేంద్రం రాష్ట్రాలకు సరిపడా యూరియా ఇస్తున్నామని చెబుతుంటే.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం డిమాండ్‌కు సరిపడా యూరియా రావడం లేదని చెబుతుంటాయి.
అయితే ఎరువుల సరఫరా జరిగేటప్పుడు పక్కదారి పట్టడం వల్లే కొరత ఏర్పడుతుందని కేంద్రం ప్రభుత్వం గుర్తించినట్లుగా తెలుస్తోంది. అందుకు రాష్ట్రాలకు ఎరువులు సకాలంలో చేరుకొనేలా రవాణా, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సమగ్ర చర్యలను చేపట్టింది. ప్రతి పంట కాలానికి ముందు రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యవసాయం, రైతు సంక్షేమ విభాగం సంప్రదింపులు జరపనుంది.
రాష్ట్రాలకు నెలవారీగా ఎరువుల అవసరాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖలు అంచనాలు వేసి.. వాటి ఆధారంగా ఎరువుల విభాగం నెలవారీ ఎరువుల సరఫరా చేయనుంది. అందుకు ఎరువులు సరఫరా చేసే వాహనాలకు ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయానికి వచ్చింది. రాయితీ ఎరువుల రవాణాను సమీకృత ఎరువుల నిర్వహ ణ వ్యవస్థ (ఐఎఫ్‌ఎంఎస్) ద్వారా ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తారు. సకాలంలో ఇండెంట్ పంపించేలా తయారీదారులు, దిగుమతిదారులతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం సూచించింది.
అంతే కాకుండా సరిపడినన్ని రైలు వ్యాగన్లను అందుబాటులో ఉంచ డం, ఎరువుల రవాణాకు ప్రాధాన్యమివ్వడంపై రైల్వే మంత్రిత్వ శాఖతోనూ సమన్వయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. డిమాండ్, - సప్లయి మధ్య అంతరాన్ని పూడ్చడానికి, తగినన్ని ఎరువులను అందుబాటులో ఉండేలా భరోసా ఇవ్వాలని, అందుకు ముందస్తు దిగుమతులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత రబీ 2025 సీజన్‌లో యూరి యా, డీఏపీ, ఎంవోపీ, ఎన్పీకే లాంటి ఎరువులు అన్ని రాష్ట్రాల్లోనూ అందుబాటులో ఉన్నాయి.
వచ్చే ఖరీఫ్ సీజన్‌కు ఎరువుల కొరత లేకుండా ముందస్తుగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కేంద్రం సూచిస్తుంది. యూరియా సబ్సిడీ పథకం కింద, 45 కేజీల బస్తాకు రూ.242 చొప్పున గరిష్ఠ చిల్లర ధరకు రైతులకు చట్టబద్ధంగా లభిస్తుంది. రవాణా ఖర్చు, మార్కెట్ ధర మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సబ్సిడీ రూపంలో తయారీదారులు, దిగుమతిదారులకు అందిస్తారు. వీటితో పాటుగా ఫాస్పేట్, పొటాష్ (పీ అండ్ కే) ఎరువులకు పోషకాధారిత రాయితీ (ఎన్బీఎస్) పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఎన్బీసీ విధానం పరిధిలో రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచేందుకు వాటిలోని పోషక విలువల ఆధారంగా సీజన్‌లో పీవోఎస్ వద్ద జరిగే అమ్మకాలపై తయారీదారు/దిగుమతిదారుకు సబ్సిడీ లభిస్తుంది. ధరల్లో హెచ్చుత గ్గులు ఏమైనా ఉంటే వాటిని పీ అండ్ కే ఎరువులకు వార్షిక లేదా ద్వైవార్షిక ప్రాతిపదికన ఎన్బీఎస్ ధరలను నిర్ణయించేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటుంది.
తద్వారా రైతులుకు అందుబాటు ధరలకే పీ అండ్ కే ఎరువులు సరఫరా అయ్యేలా చూడనుంది. ఎరువుల సరఫరా, పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై ఈసీ చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొనే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. నిత్యావసర వస్తువుల చట్టం 1955, ఎరువుల నియంత్రణ ఉత్తర్వు 1985 ప్రకారం ఎరువుల సరఫరాలో అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు చేసింది.




