భక్తిశ్రద్ధలతో స్వాతి నక్షత్ర పూజలు
ఆండాళ్లమ్మ వారికి ఊంజల్ సేవ
యాదగిరిగుట్ట, మే 1 (విజయక్రాంతి ): శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శుక్రవారం ఆలయంలో శతకటాభిషేకం పూజలు వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో ఆండాళ్ అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి వివిధ రకాల పూలతో, తులసి దళాలతో, ఆలయ అర్చకులు పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు.ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. తిరువీధి సేవ అమ్మవారి ఊంజల్ సేవను నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో అమ్మవారిని దర్శించుకున్నారు.
భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఉదయం స్వామివారి కల్యాణం హోమాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మే డే సెలవు కావడం.. స్వాతి నక్ష త్రం.. గిరిప్రదక్షిణం ఉండడంతో రాష్ర్టం నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దీంతో యాదగిరి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. కొండ కింద రింగురోడ్డులో వాహనాలతో నిండిపోయింది. కొండపైన స్థలం తక్కువగా ఉండడంతో వాహనాలను కొద్ది సమయం కొండపైకి అనుమతించలేదు.






