4 May, 2026 | 10:24 PM

చెమటతో మొదలైన ప్రయాణం… స్వర్ణ నందితో శిఖరాగ్రానికి సుందర్!

04-05-2026 09:15 PM

బావి కూలీ నుంచి బుల్లితెర, ఉపాధ్యాయ వృత్తి వరకు అరుదైన ప్రస్థానం

ఉద్యమ గీతాల రచయితగా, ‘ఎర్రబాబు’గా ప్రత్యేక గుర్తింపు

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం కష్టాన్నే పెట్టుబడిగా మలుచుకుని అక్షర సేద్యంతో పాటు కళారంగంలోనూ రాణిస్తున్న ఇల్లందు ఉపాధ్యాయుడు కామల్ల సుందర్ ప్రతిష్టాత్మక ‘ఆనందోబ్రహ్మ స్వర్ణ నంది’ అవార్డును అందుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన అనంతరం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఏపీటీఎఫ్, ప్రస్తుతం టీపీటీఎఫ్ యూనియన్‌లో చేరిన సుందర్ తనలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన యూనియన్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా జరిగిన కార్యక్రమంలో సినీ హాస్య నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ చేతుల మీదుగా మే 3 ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును స్వీకరించారు. సుబ్లేడు గ్రామానికి చెందిన సుందర్ జీవన ప్రయాణం సాహసోపేతం తల్లితండ్రులు వెంకటమ్మ, వెంకయ్యలకు జన్మించిన ఆయన కుటుంబం కష్టాన్ని నమ్ముకుని గ్రామంలో పెద్దమనుషులుగా గౌరవం పొందిన కుటుంబం, అదే విలువలను ఆచరిస్తూ కామల్ల సుందర్ చిన్ననాటి నుంచే కష్టపడుతూ ఎదిగారు.

చదువుకునే రోజుల్లోనే బావి కూలీగా పని చేస్తూ బంధువులతో, కూలీ కార్మికులతో ఐక్యతగా జీవిస్తూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. చెమటోడ్చి బావులు తవ్విన చేతులతోనే విద్యను కొనసాగించి పట్టుదలతో పట్టువీడని విక్రమార్కుడిలా ఉపాధ్యాయ వృత్తిని సాధించి గ్రామంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు, ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూనే తనలోని కళాత్మకతను మెరుగుపరుచుకుని పలు టీవీ సీరియల్స్‌లో నటించి నటుడిగా గుర్తింపు పొందారు.

తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధనకై ఉద్యమ గీతాలను రచించిన ఘనత కూడా సుందర్ సొంతం, బుల్లితెరపై సినీ హాస్య నటుడు బాబు మోహన్‌కు డూప్‌గా ‘ఎర్రబాబు’ పాత్రలో నటించి ప్రత్యేక గుర్తింపు పొందారు, ఒకవైపు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ మరోవైపు వెండితెర, బుల్లితెరపై రాణిస్తున్న సుందర్ ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది, ఆయనకు ఈ గౌరవం దక్కడం పట్ల స్థానికులు, తోటి ఉపాధ్యాయులు, కళాకారులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.