విజయం అద్వితీయం
మన దేశంలో క్రికెట్ మతమైతే క్రికెటర్లు దేవుళ్లు.. ఇక వారు సాధించే ప్రతీ విజయం కూడా అభిమానులకు పండుగే. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవడంతో భారత క్రికెట్ అభిమానులు ఈ విజయాన్ని ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టీ20ల్లో భారత్‌కు తిరుగేలేదంటున్నారు. అసలు ఈ ప్రపంచకప్ విజయంలో భారత ప్రయాణం కాస్త పడుతూ లేస్తూనే సా గింది.
గ్రూప్ స్టేజ్‌లో తిరుగులేదు.. ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ దుమ్మురేపేశారు. అమెరికాతో మ్యాచ్‌లో కాస్త తడబాటుకు గురై టెన్షన్ పడినా తర్వాత కోలుకుంది. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌లలో పాకిస్థాన్‌తో మ్యాచ్ అత్యంత ఆసక్తిని రేకెత్తించింది. అసలు భారత్‌తో ఆడమంటూ పాక్ ఓవరాక్షన్ చేసినా చివరికి ఐసీసీ వార్నింగ్‌తో దిగొచ్చింది. కానీ అసలు ఆటలో మాత్రం భారత్ దెబ్బకు తోక ముడిచింది. ఏ దశలోనూ పాక్ నుంచి పోటీ లేకపోవడంతో టీమిండియా ఏకపక్ష విజయాన్ని అందుకుంది.
తర్వాత మరో రెండు విజయాలతో గ్రూప్ స్టేజ్‌ను అగ్రస్థానంతో ముగించిన భారత్‌కు సూపర్ 8లో మాత్రం దిమ్మతిరిగే షాక్ తగిలింది. తొలి మ్యాచ్‌లో సాతాఫ్రికాపై అనూహ్యంగా పరాజయం పాలైంది. ఇక్కడ నుంచి అసలు భారత్ సెమీస్‌కు చేరుతుందా అన్న అనుమానాలు తలెత్తాయి. అయితే ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న భారత జట్టు తర్వాత వరుసగా రెండు విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టింది.
సంజూ శాంసన్ విండీస్‌పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సెమీఫైనల్లో సైతం మరోసారి సంజూనే విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్‌పై అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. అసలు ఈ టోర్నీలో పలు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన సంజూ తన కెరీర్‌లో ఇవే చివరి అవకాశాలుగా భావించి కీలక ఇన్నిం గ్స్‌లు ఆడాడు. వరుసగా మూడో హాఫ్ సెంచరీతో ఫైనల్లోనూ సంజూనే ఎ ట్రాక్షన్ అయిపోయాడు.
అతనితో పాటు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ కూడా చెలరేగిన వేళ, చివర్లో శివమ్ దూబే మెరుపులు మెరిపించిన క్రమంలో భారత్ 255 పరుగుల స్కోరుతో విజయాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. ఇక అహ్మదాబాద్ స్టేడియంలో ఫ్యాన్స్‌ను సైలెంట్ చేస్తామంటూ మాట్లాడిన కివీస్ కెప్టెన్‌కు మన బౌలర్లు వరుస వికెట్లు తీసి వయోలెన్స్ చూపించారు. ఫలితంగా 159 పరుగులకే కుప్పకూలిపోవడం, సరికొత్త చరిత్ర సృష్టిస్తూ భారత్ మూడోసారి, వరుసగా రెండోసారి, సొంతగడ్డపై తొలిసారి ప్రపంచకప్ విజయాన్ని ఆస్వాదిస్తోంది.
భారత్ విజయంలో హీరోలుగా చెప్పుకోవాల్సిన ఆటగాళ్లు సంజూ శాంసన్, శివమ్ దూబే, జస్ప్రీత్ బుమ్రా... మిగిలిన ఆటగాళ్లు సైతం తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా నిన్నటి వరకూ విమర్శలు ఎదుర్కొన్న కోచ్ గంభీర్‌పై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది.తన మార్క్ వ్యూహాలతో టైటిల్ అందించాడంటూ అభినందనలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే టీమిండియా వరల్డ్ కప్ విజయాన్ని శతృదేశం పాకిస్థాన్ మాత్రం జీర్ణించుకోలేకపోతోంది.
ఈ క్రమంలో ఆ దేశ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ పిచ్చి కూతలు కూశాడు. భారత్ తన డబ్బు బలంతోనే ప్రపంచ క్రికెట్‌ను నాశనం చేస్తోందంటూ అక్కసు వెళ్లగక్కాడు. దీనికి భారత అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. క్రికెట్‌లోనైనా, యుద్ధంలోనైనా ఎవరి సత్తా ఏంటనేది ప్రపంచం మొత్తం చూసిందని, భారత్ గురించి మాట్లాడే అర్హత కూడా అక్తర్‌కు లేదంటూ గట్టిగా ఇచ్చిపడేశారు.




