6 July, 2026 | 3:29 AM

ఇంకెన్నాళ్లు అద్దె ఇంట్లో?!

06-07-2026 12:44 AM

ఇరుకుగా మారిన సబ్ పోస్టాఫీసు 

మహబూబాబాద్, జూలై 5 (విజయక్రాంతి): అరకొర వసతుల నడుమ అర దశాబ్ద కాలం పైగా అద్దె ఇంట్లో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సబ్ పోస్ట్ ఆఫీస్ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో నర్సంపేట సర్కిల్ డివిజన్ ఆధ్వర్యంలో కేసముద్రం మండల కేంద్రంలో 50 ఏళ్ల క్రితం సబ్ పోస్ట్ ఆఫీస్ అద్దె ఇంట్లో ఏర్పాటు చేశారు. అప్పటినుండి ఇప్పటివరకు తరచుగా ఇండ్లు మారుతూ.. అరకొర వసతుల మధ్య అటు పోస్టల్ సిబ్బంది, ఇటు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

రోజురోజుకు కేసముద్రం సబ్ పోస్ట్ ఆఫీసులో వినియోగదారుల సంఖ్య పెరుగుతుండడంతో పాటు వాణిజ్య బ్యాంకుల తరహాలో ఆర్థిక సేవలను అందిస్తోంది. కేసముద్రం సబ్ పోస్టాఫీసు ద్వారా కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు, వరంగల్ జిల్లా నెక్కొండ మండల పరిధిలోని 20 గ్రామాలకు పోస్టల్ బట్వాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కేసముద్రం పోస్ట్ ఆఫీస్ పరిధిలో 8 వేలకు పైగా ఖాతాదారులు వివిధ సేవలను పొందుతున్నారు.

ఫికస్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, సేవింగ్ ఖాతాలు, సుకన్య సమృద్ధి యోజన, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు రిజిస్టర్ పోస్టులు, స్పీడ్ పోస్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనితో నిత్యం పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులతో కిక్కిరిసిపోతోంది. ప్రస్తుతం అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న పోస్ట్ ఆఫీస్ సేవలకు అవసరమైన వసతి లేక ఇబ్బంది కలుగుతోంది. దీనికి తోడు అదనంగా ఇటీవల ఆధార్ సేవా కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంతో మరింత ఇబ్బందికరంగా మారింది.

ఒకే గదిలో పోస్ట్ ఆఫీస్ సేవలు, ఆధార్ సేవా కేంద్రం నిర్వహణ ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. కనీసం బయట నిలబడడానికి కూడా అనువైన స్థలం లేదు. వృద్ధులు, పిల్లలు, మహిళలు ఆధార్ సేవల కోసం నిరీక్షించడానికి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసముద్రం పట్టణ పరిధిలో ఒకే ఒక ఆధార్ సేవా కేంద్రం పోస్ట్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం వల్ల నిత్యం అనేకమంది ఆధార్ సేవల కోసం తరలివస్తున్నారు. పోస్ట్ ఆఫీస్, ఉపతపాల కార్యాలయం, ఆధార్ సేవల కేంద్రం ఇరుకు గదిలో నిర్వహిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేసముద్రం మండల కేంద్రాన్ని ఇటీవల మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంతో పోస్ట్ ఆఫీస్ సేవలు మరింత విస్తరించాల్సిన అవసరం నెలకొంది. ఈ తరుణంలో పోస్ట్ ఆఫీస్ కోసం సొంత భవనం నిర్మించి, ప్రజలకు, వినియోగదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని కోరుకున్నారు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ నిర్వహిస్తున్న అద్దె ఇంటి పక్కనే పాత టెలిఫోన్ ఎక్స్చేంజి భవనం శిథిలమైపోయి ఉందని, ఆ భవనాన్ని తొలగించి కొత్తది నిర్మించి అందులో పోస్ట్ ఆఫీస్, శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. పోస్టల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కేసముద్రం పోస్ట్ ఆఫీస్ కు సొంత వసతి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.