6 July, 2026 | 4:30 AM

అధ్వాన్నంగా ఆర్ అండ్ బీ రోడ్డు

06-07-2026 12:54 AM

రాకపోకలకు ఇబ్బంది

వెంకటాపురం (నూగూరు), జూలై 5 (విజయక్రాంతి): వెంకటాపురం మండలంలో ప్రధాన రహదారి పూర్తిగా గుంతల మయంగా మారి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై చిన్న గుంతలు పెద్ద గోతులుగా మారి బురద నీటితో నిండిపోయాయి.

నిత్యం వందలాది ఇసుక లారీల ఈ రహదారి పై ప్రయాణిస్తుండడంతో  రహదారి మరింత అధ్వానంగా తయారయ్యి వాహనదారులకు నరకప్రాయంగా మారింది. వెంకటాపురం నుండి భద్రాచలం, ఏటూరు నాగారం  మీదుగా నిత్యం వేలాది మంది ఈ ఆర్ అండ్ బీ రహదారిపైనే ఆధారపడి ప్రయాణిస్తున్నారు. రోడ్డు దుస్థితి కారణంగా 30 కిలోమీటర్ల ప్రయాణానికి గంటకు పైగా సాగుతోంది.

ప్రయాణికుల ఆవేదన:  

వెంకటాపురం నుండి భద్రాచలం, ఏటూరునాగారం  వెళ్ళాలంటే భయంగా ఉందని చెబుతున్నారు. బ్పై వెళ్తే గుంతల్లో పడి ప్రమాదాలు జరుగుతున్నాయని, రాత్రిపూట అసలు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, గర్భిణీలను, అనారోగ్యంతో ఉన్నవారిని ఆస్పత్రికి తీసుకెళ్లడం చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బస్సులు, ఆటోలు గుంతల్లో ఊగిసలాడుతూ వెళ్తున్నాయని, చిన్నారులు స్కూల్కు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు కనీసం గుంతలు కూడా పూడ్చడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వెంకటాపురం నుండి చర్ల వరకు, అలాగే ఏటూరు నాగారం వరకు అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో పాటు కొన్ని చోట్ల అడుగు లోతు వరకు ఉన్నాయని , బురద, నీరు, వర్షపు నీరు రోడ్డుపై నిలిచి బురదగా మారిందని, ఆయా ప్రదేశాల్లో వాహనాలు స్కిడ్ అవుతున్నాయని, ఫలితంగా ప్రతిరోజు రెండు నుంచి మూడు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. దీనికి తోడు ఇసుక లారీల అతివేగంతో దూసుకు వెళ్తూ నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్నా, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలన నిత్యం రహదారి వెంట ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్లు అద్వానంగా మారడంతో అంబులెన్స్లు, బస్సులు కూడా నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోందని, అధికారులు స్పందించి వెంటనే దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు నిర్వహించి మెరుగైన రావణ సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.