24 August, 2026 | 8:26 PM

ఏఐఎస్బీ ఆధ్వర్యంలో ‘కలెక్టరేట్ ముట్టడి’

24-08-2026 06:50 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏఐఎస్బీ) మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ సోమ వారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వం, అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట సన్నీ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేసి విద్యార్థులను, కళాశాల యాజమాన్యాలను ఆదుకోవాలని కోరారు.

పాలిటెక్నిక్ విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే శక్తి స్కీమ్ (Shakti Scheme), జీఓ 97లను తక్షణమే రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయాలని కోరారు. మంచిర్యాల జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణ సమర్థవంతంగా సాగడానికి ఖాళీగా ఉన్న జిల్లా విద్యాశాఖాధికారి (DEO) పోస్టులో వెంటనే రెగ్యులర్ అధికారిని నియమించాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ వసతి గృహాలకు (Hostels), గురుకుల విద్యాలయాలకు వెంటనే సొంత పక్కా భవనాలను నిర్మించాలని, విద్యార్థినుల, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, పాఠశాలలు, కళాశాలలకు సమీపంలోనే వసతి గృహాలను ఏర్పాటు చేయాలి.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు, కాంపౌండ్ వాల్స్ వంటి కనీస మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో విద్యార్థి లోకాన్ని ఏకం చేసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్బీ జిల్లా అధ్యక్షులు జతిన్ గౌడ్, నాయకులు సాయి చరణ్, మోహిన్, అఖిల్, రామ్ చరణ్, ఈశ్వర్, అశ్వంత్, ఓంకార్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.