డ్రగ్స్ నివారణకు పోలీస్ జాగిలాలతో విస్తృత తనిఖీలు
టేకులపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు ఇల్లందు డీఎస్పీ యు.వెంకన్నబాబు సూచనలతో టేకులపల్లి మండలంలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలను గుర్తించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జాగిలాలతో టేకులపల్లి మండలంలోని నిర్మానుష్య ప్రదేశాలతో పాటు కిరాణా దుకాణాలు, పాన్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు.
టేకులపల్లి సీఐ బి. సత్యనారాయణ, ఎస్‌ఐ కె. తిరుపతి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ప్రజల వద్ద ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాలైన గంజాయి తదితర మాదకద్రవ్యాలను కలిగి ఉన్నా, విక్రయించినా, వినియోగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.






