25 August, 2026 | 1:10 AM

కోనరావుపేటలో నామమాత్రంగా ప్రజావాణి

24-08-2026 08:01 PM

అధికారుల గైర్హాజరుపై ప్రజల ఆగ్రహం

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం కోనరావుపేటలో నామమాత్రంగా ముగిసింది. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో హౌసింగ్‌ శాఖకు సంబంధించి ఒకటి, డీఆర్డీఏ శాఖకు సంబంధించి మరో దరఖాస్తు ఉన్నాయి. అయితే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు అధికారులు కేవలం సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని వారు ఆరోపించారు. తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజావాణికి వస్తే బాధ్యులైన అధికారులు అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని వాపోయారు.ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్లక్ష్యం చేయకుండా, అన్ని శాఖల అధికారులు విధిగా హాజరయ్యేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.