8 March, 2026 | 4:20 AM

కల్తీ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు

08-03-2026 12:00 AM

తెలంగాణ విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్‌రెడ్డి

సికింద్రాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): తెలంగాణలో విజయ డెయిరీ పేరుతో కల్తీ పాలు,పాల ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ విజయ డెయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి హెచ్చరించారు.

లాలాపేటలోని విజయ భవన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ కే.చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.విజయ డెయిరీ 1904లో స్థాపించబడిన సంస్థగా రైతుల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని తెలిపారు.ప్రస్తుతం విజయ డెయిరీ ద్వారా రోజుకు సుమారు నాలుగు లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించి వినియోగదారులకు నాణ్యమైన పాలను అందిస్తున్నామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత విజయ డెయిరీ కార్యకలాపాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాయని తెలిపారు.

అయితే ఆంధ్రప్రదేశ్లో విజయ డెయిరీ బ్రాండ్ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మార్కెట్లో విజయ బ్రాండ్ పేరుతో నకిలీ పాలు,పాల ఉత్పత్తులు విక్రయిస్తూ వినియోగదారులను గందరగోళా నికి గురిచేస్తున్నారన్నారు. కొన్ని సంస్థలు రైతుల నుంచి పాలు సేకరించకుండా విజ య బ్రాండ్ పేరుతో పాలు,నెయ్యి వంటి ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని అమిత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి కల్తీ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి హానికరమని, వాటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.