విధ్వంసమే.. అభివృద్ధి శూన్యం
- సీఎంకు కమీషన్లపైనే ధ్యాసా
కాంగ్రెస్ పాలనలో రైతులకు తిప్పలు
మాజీ మంత్రి హరీశ్‌రావు
కరీంనగర్, మార్చి 7 (విజయక్రాంతి): రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో విధ్వంసమే తప్పా అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శనివారం గంగాధరలో చొప్పదండి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తూ పేద ప్రజలను అణగదొక్కుతుందని విమర్శించారు.
హైడ్రా పేరుతో హైదరాబాదులో విధ్వం సం, ఖమ్మంలో పేదల గుడిసెల కూల్చివేత వంటి ప్రజా వ్యతిరేక విధానాలను రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన అనంతరం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి భూములు కమిషన్ల మీదనే సీఎంకు ధ్యాస తప్ప ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన లేదన్నారు. ప్రజా పాలనలో రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు ఎక్కడికి పోయాయని, మళ్ళీ 99 రోజుల ప్రణాళిక పేరుతో ప్రజలను మభ్య పెట్టడమే కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని విమర్శించారు.
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాను వాటర్ హబ్‌గా మార్చా మని, చొప్పదండి, జగిత్యాల, మెట్టుపల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు కాళేశ్వరంతోనే నీళ్లు అందించామని చెప్పారు. వరద కాలువలో నీళ్లు కాలేశ్వరం కాదా దీని పై పండిన పంట కాళేశ్వరం నీళ్లు కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు రెండున్నర సంవత్సరాల నుండి రెండు రూపాయలు కూడా ఇవ్వలే దన్నారు. మంత్రులు కాళేశ్వరం పై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
96% గౌరవెల్లి ప్రాజెక్ట్ బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే.. రెండున్నర సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి మాటలు చెప్పుడు తప్పా కొద్దిగా మట్టి తీసిన దాఖలాలు లేవన్నారు. అనంతరం ఎడ్ల అనిల్ అనూష్ ఆధ్వర్యంలో గత నెల రోజుల నుండి గంగాధరలో జరుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి టెన్నిస్ బాల్, క్రికెట్ టోర్నమెంట్ లో 90 జట్లు పాల్గొనగా ఫైనల్ మ్యాచ్‌కు హరీశ్‌రావు హాజరై బహుమతులను అందజేశారు.
కార్యక్రమంలో ఎమ్మె ల్సీ రమణ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సంజయ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సుంకె రవిశంకర్, జగిత్యాల జడ్పి మాజీ చైర్మన్ వసంత, కరీంనగర్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు జివి రామకృష్ణారావు, సింగిల్ విండో మాజీ చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, నాయకులు మేచినేని నవీన్ రావు, కంకణాల విజేందర్ రెడ్డి, సాగి మహిపాల్ రావు, ఆకుల మధుసూదన్, కరబూజ తిరుపతి గౌడ్, వేముల దామోదర్ పాల్గొన్నారు.
పంటలు ఎండుతున్నా పట్టించుకుంటలేరు: రైతులు
‘సారు మాకు రైతు భరోసా రాలేదు. యూరియా బస్తాలు సరిగా దొరకలేదు. ఇప్పుడు మా పంటలు ఎండిపోతున్నా ఎవ్వరు పట్టించుకుంటలేరు’ అని రైతులు హరీశ్‌రావుకు మొరపెట్టుకున్నారు. గంగాధర మండలం గోపాల్‌రావుపల్లి గ్రామంలో సాగునీరు అందక ఎండిపోతున్న వరి పంటను హరీశ్‌రావుజ.. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌తో కలిసి పరిశీలించారు. దీంతో లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తే, బావుల్లో పూడిక తీసినా సాగునీరు అంద క పంటలు ఎండిపోతున్నాయని రైతులు విలపించారు.
యూరి యా కోసం లైన్‌లో నిలబడినా బస్తాలు దొరకలేదని, ఆప్ ద్వా రా యూరియా బుక్ చేద్దామంటే తమతో కావడం లేదన్నా రు. మల్లాపూర్ గ్రామ చెరువు నింపడం ద్వారా భూగర్భ జలా లు పెరిగి తమ బావుల్లో నీటిమట్టం పెరగడం ద్వారా తాము సాగు చేసిన పంటలు చేతికందేవని రైతులు తెలిపారు. శాసన సభ సమావేశాల్లో రైతాంగ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.




