ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలి
- మల్లు స్వరాజ్యం నాలుగో వర్ధంతి సభలో
సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
సూర్యాపేట, మార్చి 18 (విజయక్రాంతి) : అ మెరికా, ఇజ్రాయిల్ ఇరా న్ పై చేస్తున్న యుద్ధంను వెంటనే ఆపాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యు లు బి.వి. రాఘవులు సూచించారు. గురువా రం జిల్లా కేంద్రంలోని విజయ్ కన్వెన్షన్ హాల్ లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం నాలుగవ వర్ధంతి సందర్భంగా సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు _ దాని పర్యవసానాలు ‘ అనే అంశంపై జరిగిన సెమినార్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఇరాన్ పై యుద్ధం మూలంగా దేశంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడిందన్నారు. ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయి రాబోయే రోజుల్లో చమురు, డీజిల్, పెట్రోల్ దొరకకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పై 60 రూపాయలు పెంచిందన్నారు. మోదీ ప్రభుత్వం దేశ ప్రయోజనాల కన్నా ఇరాన్ పై యుద్ధానికె ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు.
ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయిల్ దాడి చేసి వందలాది మంది సాధారణ పౌరులను హత మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, ఇరాన్ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. అమెరికా సామ్రాజ్యవాద ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతుందని గత నెలలోనే వెనిజులా అధ్యక్షుడు మధురోని కిడ్నాప్ చేసి న్యూయార్క్ లో నిర్బంధించిందని, ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్న ఆయతుల్లా ఖమేనిని బాంబు దాడులతో హతమార్చిందన్నారు.
గతంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను, లెబనాన్ అధ్యక్షుడు గడాఫీని ఇదేవిధంగా హత్య చేసిన సంఘటనలను ఆయన గుర్తు చేశారు. ఖనిజాలు, సహజ వనరులపై, ఆయిల్ నిల్వలపై కన్నేసిన అమెరికా, ఇరాన్ ను ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకొని అక్కడున్న ఆయిల్ నిల్వలను కొల్లగొట్టాలనే దురుద్దేశంతోటే ఇజ్రాయిల్ తో కలిసి దాడులకు పాల్పడిందన్నారు. ఎంతో కాలంగా భారతదేశానికి మిత్ర దేశంగా కొనసాగుతున్న ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడి చేసిన భారత ప్రభుత్వం నోరు మెదపకుండా ఉండడం అన్యాయమని అన్నారు. ఒక స్వతంత్ర దేశంగా భారతదేశం అమెరికా సామ్రాజ్యవాద దురాహంకారాన్ని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.




