రూ.1.13 కోట్ల విలువైన దొంగసొత్తు స్వాధీనం
- కాపర్ మెటీరియల్ దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్
- మునిపల్లి, సదాశివపేట పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ
సంగారెడ్డి/ మునిపల్లి, ఆగస్టు 28 : విలువైన కాపర్ మెటీరియల్ ను బ్యాగులను చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేయడమే కాకుండా సుమారు రూ.1.13 కోట్ల విలువైన కాపర్ మెటీరియల్ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 18న అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్లోని బోలక్పూర్, ముషీరాబాద్ ప్రాంతంలోని సన్లైట్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ముంబై అమర్నాథ్కు ఈచర్ వాహనంలో 171 ప్లాస్టిక్ బ్యాగుల్లో కాపర్ ముడి పదార్థాన్ని తరలిస్తున్నారు.
మునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 65పై బుదేరా ఫ్లైఓవర్ దాటిన అనంతరం పాట్నం హైవే హోటల్ సమీపంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి అడ్డగించి, కత్తులతో బెదిరించి వాహన డ్రైవర్ సైఫూన్ బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకుని, అనంతరం ఆరూర్ పరిధిలో వదిలివెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే మునిపల్లి పోలీసులు ఈచర్ వాహనంలోని జీపీఎస్ లొకేషన్ను ఉపయోగించి ఆరూర్ పరిధిలో వాహనాన్ని గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది.
వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 48 బ్యాగుల కాపర్ మెటీరియల్ మాత్రమే ఉండగా, 123 బ్యాగులు చోరీకి గురైనట్లు గుర్తించారు. చోరీకి గురైన కాపర్ ముడి పదార్థం విలువ సుమారు రూ.1.13 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదుదారు మొహమ్మద్ ఫయాజుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మునిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఈనెల 27న అనుమానిత డీసీఎం వాహనం కంకోల్ టోల్గేట్ దాటి జహీరాబాద్ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు.
వెంటనే పోలీసు బృందం దిగ్వాల్ గ్రామం సమీపంలో వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేసి, వాహనంలో ఉన్న షేక్ సబీర్ షరీఫ్ ను అదుపులోకి తీసుకుని మునిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారణలో షరీఫ్ కాపర్ చోరీ విషయం వెల్లడించగా ప్రధాన నిందితుడు సోహెల్ తో పాటు మరో 10 నుంచి 11 మంది వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తెలిపినట్లు చెప్పారు.
దీంతో చోరీకి గురైన కాపర్ మెటీరియల్ తో పాటు చోరీకి గురైన ఈచర్ వాహనం, మిగిలిన 48 బ్యాగుల కాపర్ స్వాధీనం చేసుకొని నిందితుడు షరీఫ్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు మునిపల్లి, సదాశివపేట పోలీసుల కృషిని ఎస్పీ అభినందించారు.






