29 August, 2026 | 2:13 AM

అనుమతి ఒకటి.. నిర్మాణం మరొకటి!

29-08-2026 12:43 AM
  1. ఇంటి అనుమతితో.. ఫంక్షన్ హాల్ నిర్మాణం 
  2. వాణిజ్యపరమైన అనుమతి లేకున్నా అక్రమ కట్టడం 
  3. రెండేళ్ళుగా చోద్యం చూస్తున్న అధికారులు
  4. అవినీతికి అడ్డాగా మారుతున్న పంచాయతీ కార్యాలయాలు

హత్నూర, ఆగస్టు 28: ఇంటి నిర్మాణానికి పొందిన అనుమతుల పరిధిని దాటి అదే స్థలంలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. సంగారెడ్డి జిల్లాఇ హత్నూర మండలం కాసాల పంచాయతీ పరిధిలో దౌల్తాబాద్ ప్రధాన రహదారి పక్కన ఉన్న సర్వే నంబర్ 316/ఈఈ 2/2లో 358.79 చదరపు గజాల స్థలంలో జీ ప్లస్ 2 ఇంటి నిర్మాణానికి గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొందినట్లు సమాచారం.

2024 జూన్లో మండల స్థాయి అధికారులు గ్రామ స్పెషల్ ఆఫీసర్లుగా ఉన్న సమయంలో ఈ అనుమతులు తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ అనుమతులను ఆధారంగా చేసుకుని సంబంధిత వ్యక్తులు కన్వెన్షన్ సెంటర్ (కళ్యాణ మండపం) నిర్మించారని, ప్రస్తుతం వివాహాలు, ఇతర శుభకార్యాలకు అద్దెకు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అనుమతులు ఒకటైతే.. నిర్మాణం మరొకటా?

జీ ప్లస్ 2 ఇంటి నిర్మాణానికి మంజూరైన అనుమతుల మేరకే భవనం నిర్మించారా? లేక అనుమతులకు భిన్నంగా కన్వెన్షన్ సెంటర్గా రూపుదిద్దుకున్నదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవన నిర్మాణం, వినియోగానికి సంబంధించి అవసరమైన అనుమతులు ఉన్నాయా?

అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. అంతేగాకుండా గ్రామ పంచాయతీ పరిధిలో జీ ప్లస్ టూ అనుమతి కూడా ఇవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ సదరు యజమాని జీ ప్లస్ టూ పేర అనుమతి తీసుకొని ఏకంగా వాణిజ్యపరమైన భవనాన్ని నిర్మించడం వెనుక అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఫిర్యాదులపై ఎందుకు స్పందన లేదు?

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిందంటూ సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవం సైతం జరిగినప్పటికీ అధికారుల నుంచి చర్యలు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణ అనుమతులు, భవన నిర్మాణం, ప్రస్తుత వినియోగం, వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన అనుమతులపై అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మా దృష్టికి వచ్చింది.. చర్యలు తీసుకుంటాం

కాసాల పంచాయతీ పరిధి దౌల్తాబాద్ రహదారి వెంట ఇంటి నిర్మాణానికి అనుమతులు పొంది కన్వెన్షన్ సెంటర్ నిర్మించిన విషయం తమ దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, అనుమతులు ఇచ్చిన అధికారులు, నిర్మాణం చేపట్టిన వ్యక్తులకు నోటీసులు జారీ చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారుల పాత్రపైనా విచారణ చేపట్టి, నిబంధనల ఉల్లంఘన తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

-మల్లారెడ్డి, డీపీవో, సంగారెడ్డి