క్యూర్‌లో ఇందిరమ్మ ఇళ్లకు లక్కీ డ్రా
- అర్హత కలిగిన వారికే ఇళ్ల కేటాయింపు
- మరో 10 రోజుల్లో రెండో విడత షురూ
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
రాజేంద్రనగర్, ఆగస్టు 28 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ (క్యూర్) పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్ల కేటాయిం పులో ఒక అరుదైన, భావోద్వేగ సంఘటన చోటుచేసుకుంది. అర్హులైన పేదలకు పారదర్శకంగా, లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటి దఫాలో భాగంగా మొత్తం 7,350 ఇందిరమ్మ ఇళ్లను అందించేందుకు కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, రాజేంద్రనగర్, నాంపల్లి నియోజకవర్గాల్లో లక్కీ డ్రా నిర్వహించారు.
శుక్రవారం రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలార్దేవుపల్లి (లక్ష్మీగూడ)లో నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమం లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఒక చిన్నారి చేతుల మీదుగా లక్కీ డ్రా టోకెన్ తీయించారు. ఆ చిన్నారి తీసిన టోకెన్‌లో .. సొంత కుటుంబానికే (జరపుల లక్ష్మి) ఇల్లు వరించింది. ఈ అరుదైన ఘట్టంపై మంత్రి శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ.. చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం, వారు అత్యంత స్వచ్ఛమైన మనస్సు గలవారు.
పేదల సొంతింటి కల తీర్చాలనే మా ప్రభుత్వ సంకల్పానికి దేవుడి ఆశీస్సులు తోడయ్యాయి. చిన్నోడు తీసిన లక్కీ డ్రాలో వారి కుటుంబానికే ఇల్లు రావడం మా అందరినీ ఎంతో ఆనందానికి గురిచేసింది. ఆ కుటుంబం ఈ సొంతింటిలో జీవితాంతం చల్లగా ఉండాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను’ అని తెలిపారు. కులం, మతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం అర్హత ఆధారంగానే నిష్పక్షపాతంగా ఇళ్లు కేటాయించామని మంత్రి చెప్పారు.
మరో 10 రోజుల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తామన్నారు. క్యూర్ పరిధిలో ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో స్థలాలు సేకరించి టెండర్లు పూర్తి చేశామన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో టవర్ల నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. ఇళ్ల రిజిస్ట్రేషను లబ్ధిదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అవసరాల కోసం ఇంటినీ తాకట్టు పెట్టుకునేందుకు అనుమతి ఇస్తామన్నారు. పదేళ్ల తర్వాత ఆ ఇంటిని అమ్ముకునే హక్కు కూడా లబ్ధిదారులకే ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు.






