మంచినీళ్లు.. మట్టి పాలు!
- నాలుగు రోజులుగా మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ
- రోడ్డుపై వరదలా పారుతున్న తాగునీరు.. పట్టించుకునే వారు లేరా?
గజ్వేల్, ఆగస్టు 28: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం నీరు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వృథాగా మట్టి పాలవుతోంది. పట్టణంలోని ఒకటో వార్డులో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ ఏర్పడి నాలుగు రోజులుగా వేల లీటర్ల తాగునీరు రోడ్డుపైకి ప్రవహిస్తోంది. దీంతో రహదారిపై వరదను తలపించేలా నీరు నిలిచిపోగా, విలువైన మంచినీరు వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పైప్లైన్ లీకేజీ కారణంగా నిరంతరం నీరు బయటకు వస్తుండటంతో రోడ్డు మొత్తం తడిగా మారింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటంతో పాటు పాదచారులు కూడా అవస్థలు పడుతున్నారు. మరోవైపు రోడ్డుపై ప్రవహిస్తున్న నీరు మట్టి, మురుగుతో కలిసే పరిస్థితి ఉండటంతో తాగునీటి నాణ్యతపై కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా సమస్య కొనసాగుతున్నప్పటికీ లీకేజీని అరికట్టేం దుకు చర్యలు తీసుకోకపోవడం ప్రజా ప్రతినిధులు, మున్సిపల్, మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు.
ప్రభుత్వం ప్రజలకు తాగునీటిని అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే, పైప్లైన్ లీకేజీలను సకాలంలో గుర్తించి మరమ్మతులు చేయకపోవడంతో విలువైన నీరు వృథా అవుతోందన్నారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు, మున్సిపల్ అధికారులు స్పందించి లీకేజీని వెంటనే అరికట్టి నీటి వృథాను నివారించాలని, రహదారిపై నిలిచిన నీటిని తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఒకటో వార్డు ప్రజలు కోరుతున్నారు.






