29 August, 2026 | 4:39 AM

కాగ్ లెక్కలతో పాలన గుట్టురట్టు

29-08-2026 02:38 AM
  1. నాలుగు నెలల్లోనూ రూ.19,266 కోట్ల రెవెన్యూ లోటు
  2. రూ.33,730 కోట్ల రుణాలు
  3. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి  
  4. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్  

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి) : తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయి గణాంకాలకు పొంతన లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ‘తెలంగాణ రైజింగ్’, ‘3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ’ అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి వాస్తవ వాస్తవ లెక్కలు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. కాగ్ లెక్కలతో రేవంత్ సర్కార్ పాలన డొల్లతనం బట్టబయలైందని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

కేవలం నాలుగు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిందన్నారు. బడ్జెట్‌లో రూ.6,857 కోట్ల రెవెన్యూ మిగులు  అంచనా వేయగా, నాలుగు నెలల్లోనే రూ.19,266 కోట్ల రెవెన్యూ లోటు నమోదైందని పేర్కొన్నారు. రోజువారీ పాలన, ప్రభుత్వ నిర్వహణ కోసం ఖజానాపై భారీ భారం పడుతుందని తెలిపారు.

ఇదే సమయంలో ప్రాథమిక లోటు రూ.23,197 కోట్లకు చేరిందని, ఇది ఏడాది లక్ష్యంలో 62.44 శాతానికి సమానమని వెల్లడించారు. రాష్ట్రానికి ఏడాది మొత్తానికి అనుమతించిన నికర అప్పుల పరిమితి రూ.58,458 కోట్లు కాగా.. జూలై నాటికే రూ.33,730 కోట్ల అప్పులు చేయడం రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై ఆందోళన కలిగిస్తోందన్నారు.  ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఇతర నిర్వహణ వ్యయాలు రూ.78,909 కోట్లకు చేరాయని, ఇది మొత్తం బడ్జెట్‌లో 33.66 శాతమని వెల్లడించారు.

మరోవైపు రాష్ట్రంలో కొత్త ఆస్తుల నిర్మాణానికి ఉపయోగపడే మూలధన వ్యయం కేవలం రూ.9,272 కోట్ల వద్దే ఉందని, ఇది 19.62 శాతానికే పరిమితమైందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన పన్నేతర ఆ దాయం గణనీయంగా తగ్గిందని, రూ.35,730 కోట్ల లక్ష్యానికి గాను కేవలం రూ.4,274 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు.కేంద్రం నుంచి గ్రాంట్లను రాబట్టడంలోనూ రాష్ట్రం విఫ లమైందని, రూ.24,166 కోట్ల బడ్జెట్ లక్ష్యానికి గాను రూ.2,363 కోట్లు మాత్రమే వచ్చినట్టు  తెలిపారు. ఎన్నికల హామీలను అమలుకు నిధులు ఎక్కడి నుంచి సమీకరిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.