పరాయిపాలు
పడిపోతున్న పాల ఉత్పత్తి.. 13వ స్థానంలో తెలంగాణ
- రాష్ట్రంలో రోజుకు 7 లక్షల లీటర్ల ఉత్పత్తి
- పక్క రాష్ట్రాలపై ఆధారం
- 25 లక్షల లీటర్లకు పైగా దిగుమతి
- యేటా 10వేల కోట్ల ఆదాయానికి గండి
- పాడి పరిశ్రమపై సర్కార్ దృష్టి సారించాలంటున్న పాడి రైతులు
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): తెలంగాణలో పాల ఉత్పత్తి నానా టికీ తగ్గిపోతుంది. పాడి పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పాల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ రాష్ట్రం 13వ స్థానంలో ఉన్నది. అయితే పాల ఉత్పత్తికి ప్రోత్సాహకాలు కల్పించి, ఉత్పత్తిని పెంచాల్సిన ప్రభుత్వం, పశు సంవర్ధక శాఖ (Department of Animal Husbandry) ఆ దిశగా ప్రయత్నాలు చేయడంలేదు.
దీంతో రాష్ట్రంలో ఆశించిన మేరకు పాల ఉత్పత్తి జరగకపోవడంతో ప్రతి రోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 25 నుంచి 26 లక్షల లీటర్ల పాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రంలో రోజూ కేవలం 7 నుంచి 8 లక్షల వరకే పాల ఉత్పత్తి జరుగుతోంది.
అందులో విజయడెయిరీ మాత్రమే 4 లక్షలకు పైగా పాల సేకరణ చేస్తోంది. మిగతా మదర్ డెయిరీ, కరీంనగర్‌తో ఇతర డెయిరీలు మరో 4 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్న ట్లు సంబంధిత అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పశు సంపదలో వృద్ధి లేకపోవడంతోనే ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి అవసరమైన పాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. మిల్క్ ఇన్సెంటివ్ కోసం ప్రభుత్వం వివిధ స్కీంల కింద నిధుల కేటాయింపులు జరుపుతు న్నప్పటికీ..
ఆ నిధులను ఖర్చు చేయకపోవడంతో పశు సంపద వృద్ధి చెందడం లేదని చెబుతున్నారు. ఆవులు, బర్రెల సంఖ్య తగ్గడం వల్ల పాడి, దాని అనుబంధ ఉత్పత్తులపైన ప్రభావం పడుతోంది. రాష్ట్రానికి ప్రతి రోజు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న 25 లక్షల లీటర్ల పాలను.. రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసుకుంటే ప్రతి ఏటా సుమారుగా రూ.10 వేల కోట్ల వరకు వ్యాపార అవకాశాలు సృష్టించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కేంద్ర సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటే..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో పాడి పరిశ్రమను మరింత పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవు తోంది. జాతి ఆవు, గేదెల అభివృద్ధి, బ్రీడింగ్ ఫామ్‌ల ఏర్పాటు, కృత్రిమ గర్భదారణ పద్ధతులపై గరిష్టంగా సబ్సిడీలు పొందడానికి అవకాశం ఉంటుంది.
ఇక పశుసంవర్ధక మౌళిక సదుపాయాల అభివృద్ధి నిధి నుంచి డెయిరీ ప్రాసెసింగ్, పాల ప్యాకింగ్, వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల ఏర్పాటుకు 3 శాతం వడ్డీ సబ్సిడీతో పాటు ప్రాజెక్టు వ్యయంలో రుణ సదుపాయం పొందడం. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు సహకారంతో పాల సేకరణ, కోల్డ్ చైన్ మౌలిక వసతులు, సాంకేతిక సహకారం కోసం ఆర్థిక గ్రాంట్లు, మూలధన సబ్సిడీలను వినియోగించుకునే అవకాశం ఉంది.
ప్రోత్సాహం లేకపోవడమే ప్రధాన సమస్య..
పాడి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రోత్సాహం లేకపోవడమే రైతులు ఈ రంగం నుంచి దూరమవ్వడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రైతులకు ఆశించిన స్థాయిలో మద్దతు లేకపోవడం, పశువుల ఆహారం ఖరీదు పెరగడం, పశువైద్య సేవలు సమర్థవంతంగా లభించకపోవడం వంటి అంశాలు ఈ రంగాన్ని వెనుకకు నెడుతున్నా యి. జాతీయ నమూనా సర్వే ప్రకారం.. తెలంగాణలో 0.87 శాతం మాత్రమే గ్రామీణ రైతు కుటుంబాలు పాడి పశువుల పెంపకంతో ఉపాధిని పొందుతున్నాయని తెలిసింది.
ఇది దారుణమైన గణాంకం. ఇది పాడిపరిశ్రమ వైపు యువత, రైతుల్లో ఆసక్తి తగ్గినట్టు చూపిస్తుంది. పాల ఉత్పత్తి లోటు తీవ్రత, ప్రజావసరాల దృష్ట్యా పాడి రంగాన్ని ఆదుకునేందుకు పాడిపశువుల సంఖ్య పెంపుదల, ఇతర చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు పశువుల పంపిణీ పథకాన్ని చేపట్టాలని, వ్యక్తిగత లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేయాలని రైతులు, రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
తెలంగాణకు వివిధ రాష్ట్రాల నుంచి..
* తెలంగాణకు వచ్చే పాలలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచే దిగుమతి అవుతున్నాయి. ఏపీ అనుబంధమైన అమూల్‌తో పాటు హెరిటేజ్, సంగం డెయిరీ వంటి పలు బ్రాండ్లతో హైదరాబాద్, ఇతర జిల్లాలకు పాలను సరఫరా చేస్తున్నాయి.
* కర్ణాటక ప్రభుత్వానికి చెందిన ‘నందిని’ బ్రాండ్‌తో పాటు ఇతర ప్రయివేట్ డెయిరీలు తక్కువ ధరకు లభించే పాలను తెలంగాణకు పెద్ద మొత్తంలో తరలిస్తున్నాయి.
* మహారాష్ట్ర నుంచి కూడా సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి తదితర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరానికి కూడా పెద్ద ఎత్తున పాలు దిగుమతి అవుతున్నాయి.
* దేశంలోనే ప్రసిద్ధి చెందిన ‘అమూల్ ’ బ్రాండ్ గుజరాత్ నుంచి వివిధ రకాల పాల ఉత్పత్తులు (వెన్న, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులు) తెలంగాణ మార్కెట్లోకి భారీగా వస్తున్నాయి.
మొదటి స్థానంలోకి తీసుకురావొచ్చు
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పాల వల్ల నాణ్యత లోపాలు, కల్తీ సమస్యలు వస్తున్నాయి. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల సబ్సిడీలతో, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రతి రెండు మండలాలను ఒక క్టస్టర్‌గా తీసుకుని ఒక డైయిరీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలి. విజయ డెయిరీ ద్వారా పాల సేకరణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశాం.
కోటీ మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలనే ప్రతిష్టాత్మకమైన లక్ష్యానికి డెయిరీల విస్తరణ ఉపయోగకరంగా మారడంతో పాటు పాల ఉత్పత్తిలో 13వ స్థానంలో ఉన్న తెలంగాణను మొదటి స్థానంలో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా డెయిరీల ఏర్పాటుకు భూమి కేటాయించడంతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని కోరాం. ప్రభుత్వం ఇలా చేస్తే 13వ స్థానం నుంచి మొదటి స్థానానికి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
- డెవలప్‌మెంట్ ఎజెన్సీ చైర్మన్ చరణ్‌కౌశిక్ యాదవ్






