రాష్ట్రంలో పెరిగిన నేరాలు
హైదరాబాద్‌లో తగ్గిన క్రైమ్‌రేట్
అర్ధవార్షిక నేర సమీక్షలో డీజీపీ
నేరాల నియంత్రణకు నిర్దిష్ట విధానాలను అవలంభించాలి
వ్యవస్థీకృత నేరాలపై కఠోరంగానే ఉండాలి
పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో తీవ్రమైన నేరాలు తగ్గాయని, అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్లలో నేరాలు 7.15 శాతం పెరిగాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో సీనియర్ పోలీసు అధికారులతో జరిగిన అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశంలో నేరాల పరిస్థితిని సమీక్షించారు. 2023 2,65,377 కేసులు నమోదు కాగా, 2025 వీటి సంఖ్య 2,84,363కు పెరిగింది. డ్రగ్స్ కేసుల్లో 46.10శాతం పెరుగుదల నమోదై 2,026 నుంచి 2,960 కేసులు పెరిగాయి.
ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసులు 25 నుంచి 451కి పెరిగాయి. ట్రాఫిక్ నేరాల్లో 9.48శాతం పెరుగుదల నమోదు కాగా, సైబర్ క్రైమ్ రేటు 13.29 శాతానికి తగ్గింది. ఆర్థిక నేరాలు 13.28శాతం, తీవ్ర నేరాలు 10.33 శాతానికి తగ్గగా, హైదరాబాద్‌లో తీవ్రమైన నేరాలు 26.23 శాతానికి తగ్గగా, సైబరాబాద్‌లో డ్రగ్స్ కేసులు 90.98శాతానికి పెరిగాయి.
ఆదిలాబాద్‌లో డ్రగ్స్ కేసులు 57 నుంచి 219కి చేరినట్లు డీజీపీ తెలిపారు. క్రైమ్ రివ్యూలు గణాంకాలకే పరిమితం కాకూడదని, కారణాలు, పని విధానం, దర్యాప్తు నాణ్యత, కేసుల పరిష్కారంపై విశ్లేషణ చేయాలన్నారు. ఏఐ, సీసీటీఎన్‌ఎస్, టీజీ కాప్, హాక్‌ఐ టెక్నాలజీ, ఈగల్, ఐసీజేఎస్, కొత్త క్రిమినల్ చట్టాల అమలుపైనా డీజీపీ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీజీ (శాంతిభద్రతలు) మహేష్ భగవత్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, మహిళా భద్రత, నేర పరిశోధన విభాగం (సీఐడీ) డైరెక్టర్ జనరల్ చారు సిన్హా, ఈగిల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, సీపీలు, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సీనియర్ అధికారులు హాజరయ్యారు.






