నేడు రాష్ట్ర బడ్జెట్
- రూ. 3.30 లక్షల కోట్ల అంచనాతో..?
- గత బడ్జెట్ కంటే అదనంగా..
- 8 నుంచి 10 శాతం వరకు పెంచనున్న సర్కార్
- అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- ఉదయం సమావేశం కానున్న మంత్రివర్గం
హైదరాబాద్, మార్చి19 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్‌ను శుక్రవారం ప్రవేశపెట్టనుంది. సంక్షేమం, వ్యవసాయం, సాగునీరు ప్రధానంగా దాదాపుగా రూ.3.30 లక్షల కోట్లకు అటు ఇటుగా బడ్జెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం తుది రూపం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గత బడ్జెట్ 2025-- 26 ఆర్థిక సంవత్సరంలో రూ. 3.04,965 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు గత బడ్జెట్ కంటే అదనంగా 8 నుంచి 10 శాతం పెంచనున్నట్లు సమాచారం.
ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 2,63,486 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించగా, జనవరి నెలాఖరుకు 73.37 శాతం అంటే రూ. 1,93,313 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగింది. మొత్తం మీద ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ప్రభుత్వ వ్యయం 2.50 లక్షల కోట్లకు పైగా చేరవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది కంటే 10 శాతం వరకు పెంచి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు చర్చ జరుగుతున్నది.
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా, శాసన మండలిలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశమై బడ్జెట్‌ను ఆమోదించనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మూడుసార్లు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టగా, అధికారంలోకి వచ్చిన మొదటిసారి ఓటాన్ ఆకౌంట్‌ను ఉభయసభల్లో ప్రవేశపెట్టారు.
విద్యా, వైద్యం సాగు, వ్యవసాయం, సంక్షేమం..
సంక్షేమం, వ్యవసాయం, నీటి పారుదల రంగాలకు పెద్దపీట వేస్తూ భారీగా కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ విజన్- -2047 డాక్యుమెంట్‌లోని అంశాలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించడం తో పాటు హామీల అమలుపై ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ఆసరా పెన్షన్లకు అదనంగా రూ. 500 పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు రూ. 2 వేలు ఇస్తున్న విషయం తెలిసిందే.
ఇక కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు కూడా రూ. 50 వేలు అదనంగా పెంచనున్నట్లు సమాచారం. ఈ పథకాల కింద రూ. లక్ష తోపాటు తులం ( 10 గ్రాములు ) బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పుడు బంగారం ధర 10 గ్రాముల ధర రూ. లక్షన్నరకు పైగా పెరగడంతో.. బంగారం బదులు రూ. 50వేలు అదనంగా ఇవ్వనున్నట్లు తెలిసింది. అంతేకాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా సంక్షేమం, సన్న బియ్యం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని సమాచా రం.
విద్యా, వైద్యానికి కూడా భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలిసింది. అదే సమయంలో ఇతర ఏ రాష్ట్రాల్లో లేనివిధంగా వ్యవసాయానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు గా ప్రకటించే అవకాశముంది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఒనర్ ట్యాక్స్ రెవెన్యూ ( ఎస్‌ఓటీఆర్ ) పెరిగింది. వచ్చే ఏడాది సర్కార్ ఆదాయం మరింత పెరగనుందని, అదే సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి 10 శాతంపైగా పెరుగుదలతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు చర్చ జరుగుతోంది.
ప్రాజెక్టులకు నిధులు.. యువతులకు స్కూటీలు..
నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ కోసం రూ.5 వేల కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేయగా.. ఈ బడ్జెట్లో నిధులను కేటాయించే అవకాశముంది. తుమ్మిడిహెట్టి, సీతారామ, పాలమూరు- -రంగారెడ్డి, కొడంగల్ నారాయణపేట్ ఎత్తిపోతలు, ఎస్‌ఎల్బీసీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాకుండా యువతులకు ఈవీ స్కూటీలను అందించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుండగా.. వీటికి సైతం నిధులు కేటాయించే అవకాశముంది.
విద్యారంగానికి కూడా కేటాయింపులు పెంచే చాన్స్ ఉన్నది. ఉద్యోగులకు పీఆర్సీ అమలు, డీఏల విడుదల, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిల చెల్లింపుల కోసం బడ్జెట్‌లో వీలైనంత ఎక్కువ కేటాయింపులు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మూసీ పునరుజ్జీవం, ట్రిపుల్ ఆర్, విమానాశ్రయాలు, మెట్రో రెండో దశ, స్కిల్, స్పోట్స్ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్స్ తదితరాలకు పెద్ద ఎత్తున నిధుల కేటాయించే అవకాశముంది.
అదనపు వనరులపై దృష్టి..
కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లను ఇచ్చి ఆ నిధులను వాడుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. ఉపాధి హామీలో రాష్ట్రాల వాటా 40 శాతముండాలని కేంద్రం షరతు విధించగా.. దీంతో రాష్ట్రంపై రూ. 1800 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల బకాయిలకు కూడా నిధులు సమీకరించాల్సి ఉన్నందున.. అదనపు వనరులపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తున్నది.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి సంబంధించి ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి మినహాయించాలని కేంద్రాన్ని కోరారు. దీంతోపాటు బీఆర్‌ఎస్ హయాంలో తీసుకున్న అప్పుల కు వడ్డీ రేట్లను తగ్గించాలని విన్నవించారు. ఈ రెండింటికి కేంద్రం అంగీకరిస్తే.. మరింత రుణా లు తీసుకునే అవకాశం ఏర్పడుతుందని, అప్పు డు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఎక్కువగా నిధులు కేటాయించవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రైజింగ్ 2047తో దేశంలో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో రూపకల్పన చేసినట్లుగా తెలిసింది.




