నా ఇన్‌స్టా నా ఇష్టం!
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు లవ్ బ్రేకప్ అయిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె చేస్తున్న ఇన్‌స్టా పోస్టులు కూడా వైరల్‌గా మారాయి. ఇదిలావుండగా, అనుపమ తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘క్రేజీ కల్యాణం’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియా నుంచి తనకు ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానంగా తన ఇన్‌స్టా పోస్టులపై స్పందించింది అనుపమ పరమేశ్వరన్. ‘మీ గతం గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం అవసరమా?’ అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తాను ఓ కష్టమైన సంవత్సరాన్ని గడిపానని, ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉన్నానంటూ తనదైన శైలిలో స్పందించింది.
“అది నా సోషల్ మీడియా. ఏది పోస్ట్ చేయాలో చేయకూడదో నేను నిర్ణయించుకుంటా. నేను ఏమైనా పోస్ట్ చేసుకుంటా. దాని గురించి అడిగే రైట్ ఎవరికీ లేదు. నా గురించి ఎవరికి ఏం తెలుసు. నేను ఒక కష్టమైన సంవత్సరాన్ని గడిపా. కానీ ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉన్నా. నేను ఈ స్థితికి ఇంకొంచెం ముందుగానే చేరుకుని ఉంటే బాగుండేదని మాత్రమే కోరుకుంటున్నా” అని తెలిపింది అనుపమ. కోలీవుడ్ హీరో ధ్రువ్ విక్రమ్‌తో అనుపమ ప్రేమలో ఉందంటూ కొంతకాలంగా ప్రచారం జరిగింది. ‘బైసన్’ మూవీ చేస్తున్న టైమ్‌లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే రూమర్స్ వినిపించాయి. ‘నాకు ఫ్రీడమ్ వచ్చింది. కొన్నిసార్లు మనశ్శాంతి పొందాలంటే మీరు నిస్సహాయమైన మార్గాలు వదిలేయాల్సిందే.
ఈ రోజు నుంచి నా గొంతు, నా లైఫ్ నేనే ఎంచుకుంటా. ఇకపై అనుమతులు అక్కర్లేదు. భయం లేదు. నాది అని మర్చిపోయిన జీవితంలో ప్రేమలో పడుతున్నా. ఇది స్వేచ్ఛకు స్వాగతం, నా జీవితానికి స్వాగతం’ అంటూ అనుపమ ఇన్‌స్టా పోస్టు రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం గురించే మీడియా అడగ్గా.. తాజాగా అనుపమ తనదైన శైలితో స్పందిస్తూ ఎవరి ఇన్‌స్టా వారి ఇష్టం అని చెప్పకనే చెప్పింది. ఇక ‘క్రేజీ కల్యాణం’ విషయానికొస్తే.. ఇదొక విలేజ్ కామెడీ ఎంటర్‌టైనర్. దర్శకుడు బద్రప్ప గాజుల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అఖిల్ రాజ్, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేశ్ వీకే కీలకపాత్రలు పోషిస్తున్నారు.






