3 August, 2026 | 3:23 AM

చెట్లు ఎందుకు కూలాయి..?

03-08-2026 01:01 AM

పరిశీలించిన కే.యూ పరిశోధక బృందం

ములుగు, ఆగస్టు 2 (విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేటలో ఇటీవల టోర్నడో తరహాలో వీచిన ఈదురుగాలులకు వందలాది చెట్లు నేలకూలిన సంఘటనపై, చెట్లు ఎందుకు కూలాయి అనే అంశాన్ని పరిశోధించడానికి ఆ  ప్రాంతాన్ని పర్యావరణవేత్త, వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ సుతారి సతీష్ ఆధ్వర్యంలో ఆదివారం  కాకతీయ విశ్వ విద్యాలయం పరిశోధక బృందం సందర్శించారు.

మంగపేట నుండి కోమటిపల్లి వెళ్ళే దారిలో సండ్రోని ఒర్రె సమీపం దాటిన తర్వాత శాంతి నగర్ వెళ్ళే రోడ్డు సమీపంలోమంగపేట రేంజ్ పరిధిలోని మంగపేట సెక్షన్, మంగపేట సౌత్ బీట్, కంపార్ట్మెంట్ నెంబర్ 5లోని పలుచోట్ల చెట్లు కూలిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ సుతారి సతీష్  మాట్లాడుతూ సారవంతమైన నేలల్లో మొక్క యొక్క వేర్లు నేలపై భాగంలోనే విస్తరించే ఉండడం వలన బలమైన సుడిగాలులు వీచడం ద్వారా చెట్లు నేలకూలినట్లు తెలిపారు.

ఇందులో తునికి, దుంపెన, తానిక్కాయ, విషముష్టి, యూకలిప్టస్, కూడుగా, కానుగ, జువ్వి, వచారి, వేప, కుంకుడు తదితర చెట్లు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, భూమి ఉపరితలంపై ఉన్న వేడి, తేమ గల గాలి వేగంగా పైకి లేవడం వలన బలమైన నిలువు గాలి ప్రవాహాలు ఏర్పడి ఎత్తు పెరిగినా, దిశ మారినా మీసోసైక్లోన్ లాగ ఏర్పడి వాతావరణ అస్థిరత వలన  సుడిగుండంలా వేగంగా గాలి పీడనంలోని తేడా వలన ముందుకు కదులుతూ, ఆ మార్గంలో ఉన్న చెట్లను, ఇళ్లను కబళించి తీవ్ర నష్టాన్ని కలుగ జేస్తుందని తెలిపారు.

గతంలో  ములుగు జిల్లాలోని మేడారం ప్రాంతంలో సుమారు 800 ఎకరాలలోని అటవీ ప్రాంతంలో కూడా ఇదే  తరహాలో జరిగిన సంఘటనలో సుమారు లక్షా యాభై వేల ఎత్తున చెట్లు ఏటూరునాగారం అభయారణ్యంలో నేలకొరిగిన విషయం తెలిసిందే నన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం అనాలోచితంగా చెట్లను నరకడం, ఇసుక తీవ్రంగా తోడడం, మట్టిని తవ్వి నేల గుల్ల చేయడం, గుట్టలను తవ్వి నామరూపాలు లేకుండా చేయడం వంటివి వీటన్నింటికి ముఖ్యకారణమన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త, వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ సుతారి సతీష్ , వంగూరి అనిల్ కుమార్, పసుల జానకి రాముడు, దాకూరి వర్ష, నైతం ఇందు, కత్తి సందీప్, పగడాల సాయికుమార్ పాల్గొన్నారు.