ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలోని గిరిజన గ్రామాల రోడ్ల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి మంద మకరందు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయ చాంబర్లో ఇంజనీరింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన గ్రామాల్లో రోడ్ల పరిస్థితి, మౌలిక వసతుల కల్పన, వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు చేరుకోలేని గ్రామాలను గుర్తించి, అక్కడి రోడ్ల మరమ్మత్తు పనులను ప్రాధాన్యత ఆధారంగా చేపట్టాలని సూచించారు. ప్రజలకు అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందేలా రవాణా సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలు, రహదారుల నిర్వహణ, ఇతర మౌలిక వసతుల అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వేగవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యమని ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి తెలిపారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.






