దోమల నివారణకు ప్రత్యేక చర్యలు
డిప్యూటీ కమిషనర్ శైలజ
మేడిపల్లి, జూన్ 24 (విజయక్రాంతి): దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ శైలజ అన్నారు. బుధవారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలో దోమల నివారణ చర్యలను సమర్థవంతంగా నిర్వహించేందుకు 03 వాహనాలపై అమర్చిన ఫాగింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కాలనీలు, నివాస ప్రాంతాలు మరియు ప్రజా ప్రదేశాలలో ఈ ఫాగింగ్ యంత్రాల ద్వారా విస్తృతంగా దోమల నివారణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మునిసిపల్ కమీషనర్ శ్యామ్ సుందర్ రావు, ఎస్డబ్ల్యూఎం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాహ్నవి శశాంక్, ఎస్డబ్ల్యూఎం అసిస్టెంట్ ఇంజనీర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.






