31 July, 2026 | 2:02 AM

కడెం ప్రాజెక్టును సందర్శించిన ఎస్పీ, అడిషనల్ కలెక్టర్

31-07-2026 01:07 AM

ఖానాపూర్ ,జూలై 30 (విజయక్రాంతి): గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రాజెక్టులోకి 88,828 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తొమ్మిది గేట్లలు ఎత్తేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 694 అడుగులకు చేరింది.

కొద్ది రోజులుగా బోసిపోయి కనిపించిన గోదావరి నది ఇప్పుడు వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. వరద పరిస్థితులను పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు డి ఆర్ డి ఓ విజయలక్ష్మి కడెం ప్రాజెక్టును సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇరిగేషన్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రాజెక్టు గేట్లను చూసేందుకు సందర్శకులు వచ్చే అవకాశముండటంతో ప్రాజెక్టు పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.