ఆరు రోజులు వర్షాలే!
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే ఆరు రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నాయి. జూలై 4వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. సోమవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముంది.
ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. జూలై 4వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.






