29 June, 2026 | 1:07 AM

ఓటర్ల జాబితా సవరణలో బీఎల్‌ఏల పాత్ర కీలకం

29-06-2026 12:02 AM
  1. పార్టీ పటిష్టతకు బూత్ కమిటీలు సమన్వయంతో పనిచేయాలి 
  2. బీఎల్‌ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

భద్రాద్రి కొత్తగూడెం/లక్ష్మీదేవిపల్లి, జూన్ 28 (విజయక్రాంతి): ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్ల (బిఎల్‌ఏ) పాత్ర అత్యంత కీలకమని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. ఆదివారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం ’శేషగిరి భవన్’లో నిర్వహించిన లక్ష్మీదేవిపల్లి మండల స్థాయి సిపిఐ పక్ష బూత్ లెవల్ ఏజెంట్ల (బిఎల్‌ఏ)ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత బిఎల్‌ఏలదేనని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వీడి క్షేత్రస్థాయిలో జరిగే సర్వేలో బీఎల్వోలతో కలిసి చురుగ్గా పాల్గొనాలని సూచించారు.

నియోజకవర్గ పరిధిలో బోగస్ ఓట్ల తొలగింపుపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అర్హత లేని వారిని గుర్తించడం, చనిపోయిన వారు, వలస వెళ్ళిన వారి వివరాలను జాబితా నుండి తొలగించేలా చూడాలన్నారు. అర్హులైన యువతీ యువకులకు నూతన ఓటర్ల నమోదు, కార్డుల్లో తప్పుల సవరణపై ప్రజల్లో విస్తృత అవగాహన తేవాలన్నారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, మండల కార్యదర్శి  లక్ష్మీపతితదితరులు పాల్గొన్నారు.