29 June, 2026 | 1:06 AM

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.!

29-06-2026 12:00 AM
  1. నిర్మాణ సమయంలోనే కుంగిపోయిన వంతెన
  2. రూ. 40 లక్షల పనులపై పర్యవేక్షణ లోపం
  3. భవిష్యత్తులో వాహన రాకపోకలపై ప్రశ్నార్థకం

అచ్చంపేట, జూన్ 28 : ప్రభుత్వ పనుల నాణ్యతను పర్యవేక్షించాల్సిన అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. దీని వలన రూ. లక్షలు వెచ్చించి చేపట్టిన పనుల నాణ్యత ప్రశ్నార్థాకంగా మారడంతో పాటు.. భవిష్యత్తులో దాని వినియోగం ప్రజలకు ఎంత మేరా ఉపయోగపడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం ఐనోల్ చౌరస్తా చేదురుబావితండా మధ్యలోని ప్రధాన రహదారిపై నక్కమర్రివాగు నుంచి వచ్చే నీళ్లతో రహదారి పూర్తిగా కొట్టుకుపోయి వాహనాల రాకపోకలకు ఆటంకంగా మారింది.

దీంతో ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక చొరవతో రహదారిపై కల్వర్టు నిర్మాణానికి ప్రభుత్వం రూ. 40 లక్షలు మంజూరు చేసింది. పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ కొద్ది నెలల క్రితమే పనులు ప్రారంభించారు. ప్రస్తుతం పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇప్పటికే పూర్తి కావాల్సిన పనుల్లో వేగం లోపించడంతో నెమ్మదిగా కొనసాగుతున్నాయి. దీనికి తోడు పనుల్లో నాణ్యత పూర్తిగా లోపించిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. 

నిర్ల్యపు ఆనవాళ్లు..

అచ్చంపేట నుంచి రంగాపూర్ మీదుగా ఐనోల్ చౌరస్తా నుంచి అక్కారం వరకు ఉన్న రోడ్డు ఆర్‌అండ్ బీ శాఖ పరిధిలో ఉంది. దీంతో నక్కమర్రివాగు వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనుల పర్యవేక్షణ బాధ్యతలు అచ్చంపేట ఆర్‌అండ్ బీ అధికారులు చూస్తున్నారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కల్వర్టు నిర్మాణం.. నాణ్యతను గాలికొదిలేశారు. సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో కల్వర్టు మధ్యలో అడుగు మేరా కిందకు కుంగిపోయింది.

ఐనోల్ వెళ్లే మార్గంలోని కుడి వైపు కిందకు ఒరిగినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం కల్వర్టు క్యూరింగ్ చేస్తున్నారు. కింద సపోర్టింగ్ కోసం పెట్టిన ఇనుప చువ్వలు సరిగా పెట్టకపోవడంతోనే కల్వర్టు పనుల్లో నాణ్యత లోపించినట్లు స్పష్టమవుతోంది. ఈ కల్వర్టు నిర్మాణం పూర్తయితే అచ్చంపేట మండలంలోని ఐనోల్, బొమ్మన్ పల్లి, సిద్దాపూర్, మన్నెవారిపల్లి, బక్కలింగాయపల్లి, అక్కారం, ఘనపూర్, ఆంజనేయతండా, మార్లపాతండా, దండ్యాలంతండా, పద్మారంతండా, పులిదేవిబండతండా, దేవులతండాతో అనేక తండాలకు రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోతాయి.

అలాగే మన్నెవారిపల్లి సమీపంలో నిర్మిస్తున్న రాష్ట్రంలోనే ప్రధానమైన ఎస్‌ఎల్బీసీ టన్నెల్ పనులకు వెళ్లే వాహనాలు వెళ్లాలంటే ఇదే మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. అంతటి ప్రాధాన్యత కలిగిన రహదారిపై నిర్మిస్తున్న కల్వర్టు పనుల నాణ్యత మాత్రం గాలిలో దీపంలా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారల పర్యవేక్షణ లోపం. 

పనులను పర్యవేక్షించాల్సిన ఆర్‌అండ్ బీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. పనులు మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు అనుక్షణం పర్యవేక్షించాల్సి ఉండగా.. అటువైపు కన్నెత్తి చూటనట్లు ఉన్నారు. అందుకే కల్వర్టు కుంగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

డీఈ స్థాయి అధికారి పర్యవేక్షించాల్సి ఉన్నా.. కేవలం కింది స్థాయి సిబ్బందిని పురమాయించడం.. ఆయన సైతం పని జరుగుతున్న సమయంలో బాధ్యత రహితంగా వ్యవహరించడంతో కాంట్రాక్టర్ ఇష్టాతీరుగా పనులు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక వేళా అధికారులే పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తే ప్రభుత్వ నిబంధనల మేరకు కల్వర్టు నిర్మాణం జరిగేదని చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులో ఈ కల్వర్టుపై భారీ వాహనాలు వెళ్తే తట్టుకొని మనుగడ సాగిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

కాంట్రాక్టర్ తప్పేమీ లేదు: డీఈ

నక్కమర్రివాగు వద్ద నిర్మిస్తున్న కల్వర్టు కొంత కిందకు ఒరిగినది వాస్తవమేని ఆర్‌అండ్ బీ డీఈ జలందర్ తెలిపారు. అందులో కాంట్రాక్టర్ తప్పేమీ లేదని వెనకేసుకొచ్చారు. పైగా కాంట్రాక్టర్ రూ. 4 లక్షల వరకు వెచ్చించి డబ్బా చేయించి.. కల్వర్టు నిర్మించాడని చెప్పారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ విషయంలో విజ్నతతో ఆలోచించాలని ఉచిత సలహా ఇచ్చారు. దీని బట్టి చూస్తే కాంట్రాక్టర్ నిర్ల్యక్షం పనులపై ఎంత మమకారం ఉందో తెలుస్తోంది. పనుల విషయంలో రాజీ లేకుండా నిక్కచ్చిగా వ్యవహరించి కాంట్రాక్ట్ప చర్యలు తీసుకోవాల్సిన డీఈ ఆయన్ను వెనకేసుకురావడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.